Off The Record: కర్నూలు పార్టీపై చంద్రబాబు లోకేష్ ఫోకస్!

Off The Record: ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గపోరు. ఆదోని, మంత్రాలయం, ఆలూరు, నంద్యాల నియోజకవర్గాల్లో అసమ్మతిని చక్కదిద్దేందుకు మంత్రుల బృందం రంగంలోకి.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 1 Sept 2026 6:48 AM IST
Off The Record
X

Off The Record: కర్నూలు పార్టీపై చంద్రబాబు లోకేష్ ఫోకస్!

Off The Record: ఏపీలో సాధారణ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన తర్వాత వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి అనుకూల ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో సన్నగిల్లుతోందట.

దానికి అసలు కారణాలు లేకపోలేదు. కలిసి పని చేయాల్సిన నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సొంత కుంపటి పెట్టుకోవడం కొంత మైనస్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఫలితంగా టిడిపి కొన్ని నియోజకవర్గాల్లో దెబ్బతినే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు.

ఎన్నికల సమయంలో కూడా ఈ నాయకుల మధ్య సఖ్యతకు కొరవడిందట. అయితే స్థానిక ఎన్నికలకు కొంచెం సమయం ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కొత్త ప్లాన్ వేసోందట తెలుగుదేశం పార్టీ అధిష్టానం.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల్లో విబేధాలు ఉన్న నాయకుల జాబితా తెప్పించుకున్న అధిష్టానం.. డ్యామేజ్ కంట్రలో చేసే పనిలో బిజీగా ఉందట. ఆయా నియోజకవర్గాలకు రాష్ట్ర మంత్రుల బృందాన్ని పంపించి సొంత పార్టీ నేతల మధ్య విభేదాలను చక్కబట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందట ఆ పార్టీ అధినాయకత్వం.

కర్నూలు జిల్లాలోని ఆలూరు మంత్రాలయం నియోజకవర్గం ఇప్పటికే జిల్లా ఇన్చార్జి, మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు ఇద్దరు మంత్రులు ఆలూరు మంత్రాలయంలో పర్యటించి సొంత పార్టీ నేతలతోపాటు కూటమి నేతలతోనూ సమావేశమయ్యారట. కూటమి నాయకలందరూ ఐక్యతారాగంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టి కూటమి అభ్యర్థులను గెలిపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.

మంత్రాలయం నియోజకవర్గంలో ప్రస్తుత ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి.. స్థానిక టిడిపి నేతలతో కలిసి పనిచేయడం లేదన్న టాక్ లేకపోలేదు. తన కేడర్‌ను తప్పించి వేరే నాయకులతో అంత సఖ్యతతో ఉండడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మిగతా నాయకులను కలుపుకొని వెళ్లడంలో ఆయన ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇలా పలు అంశాలపై పూర్తి వివరాలు టిడిపి అధిష్టానానికి చేరడంతో యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇద్దరు మంత్రులను మంత్రాలయానికి పంపించి అసంతృప్తి నాయకులతోపాటు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసిందట.

మరోవైపు ఆదోనిలో టిడిపి వర్సెస్ బిజెపి అన్నట్లు చాలా రోజుల నుంచి నేతల మధ్య దూరం పెరుగుతూ వస్తోందట. టిడిపి అసంతృప్తి నాయకులు బిజెపితో కలిసి వెళ్లడానికి సిద్ధంగా లేరని సమాచారం. ఆదోని బిజెపి ఎమ్మెల్యే కూడా వారిని కలుపుకొని వెళ్లే అవకాశాలు లేవట.

ఆలూరు నియోజకవర్గంలో కూడా టిడిపి నేతల మధ్య దూరం రోజురోజుకు పెరుగుతోందట. ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి టిడిపి బలోపేతానికి కృషి చేస్తుంటే అదే పార్టీకి చెందిన నాయకులు తమను కలుపుకోవడం లేదని, ఇబ్బంది పెడుతున్నారని పార్టీ అధిష్టానానికి చెప్పారట. దీంతో ఆలూరులో కూడా జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మరో మంత్రి సవిత టిడిపి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో అసంతృప్తి నాయకులు హాజరుకాకపోవడం టిడిపిలో అంతర్గత పోరు ఏమేరకు చేరిందో తెలిసిపోతోందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఎమ్మిగనూరులోనూ ముఖ్య నాయకులు పార్టీలో ఉంటున్న తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

నంద్యాల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తోందట. టిడిపి నాయకులు అంటీముట్టినట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ అధిష్టానానికి రిపోర్ట్ వెళ్ళిందట. ముఖ్యంగా ఆళ్లగడ్డలో టిడిపి, జనసేన మధ్య చైర్మన్ పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్య నాయకులను దూరం పెట్టారని ప్రచారం జరుగుతోంది.

నంద్యాలలో ఇదే పరిస్థితి. అటు డోన్‌లో కూడా ఎమ్మెల్యే వర్గం ఓవైపు.. కేఈ వర్గం మరోవైపు అన్నట్లుగా రాజకీయం జరుగుతోంది. పైకి అందరూ కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం ఒకరిపై ఒకరు అధిపత్యం ప్రదర్శిస్తూ పావులు కదుపుతున్నారట. ఫలితంగా పార్టీ డ్యామేజ్ అవుతోందట. ఇది వైసిపీకి బాగా కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో టిడిపి నాయకుల విభేదాలు.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ్ల వైసీపీకి అనుకూలంగా మారనుందన వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. ఇది గ్రహించిన టిడిపి అధిష్టానం.. దిద్దుబాటు చర్యలు ఉపక్రమించింది. మరి రానున్న రోజుల్లో టిడిపి దిద్దుబాటు చర్యలు ఏమేరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story