Kurnool: హామీల అమలుపై జగన్‌తో చర్చకు సిద్ధం.. టిడిపి నేతల సవాల్!

Kurnool: కర్నూలు 5వ వార్డులో టిడిపి నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ ఆధ్వర్యంలో "మన నగరం - మన బాధ్యత" సదస్సు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Jun 2026 9:21 PM IST
Kurnool
X

Kurnool: హామీల అమలుపై జగన్‌తో చర్చకు సిద్ధం.. టిడిపి నేతల సవాల్!

Kurnool: కర్నూలు నగరంలోని 5వ వార్డులోని జమ్మి చెట్టు వద్ద, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ గారి ఆధ్వర్యంలో "మన నగరం - మన బాధ్యత" కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు యాదవ్, కర్నూలు నియోజకవర్గం పార్టీ పరిశీలకులు ఉమర్ ముక్తయార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సందర్భంగా మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పరిపాలనలో వైఫల్యం చెంది రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఆరోపించారు.

నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి జగన్ రెడ్డికి నైతిక అర్హత లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసిందని, అమలు చేయని హామీ ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు తాము సిద్ధమని పేర్కొన్నారు.

ప్రజలు ఇక జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని, ఆయనకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు తలచుకుంటే జగన్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే జైలుకు పంపగలరని, అయితే అలాంటి ప్రతీకార రాజకీయాలకు ఆయన పాల్పడరని చెప్పారు.

అయితే జగన్ రెడ్డి మాత్రం రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కేసులు సృష్టించి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైలులో ఉంచారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి పాలనపై విమర్శలు చేసే ముందు జగన్ రెడ్డి తన గత పాలనను పరిశీలించుకోవాలని అన్నారు.అలాగే పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) శాఖల మంత్రి టి.జి. భరత్ గారి గురించి మాట్లాడే ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో శ్రీయుతులు మన్సూర్ అలి ఖాన్, సోమిశెట్టి నవీన్, రామక్రిష్ణ, సుంకన్న, విజయ లక్ష్మి, నాగేశ్వరరావు, నాగరాజు మొదలగు వారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story