Kurnool: నీతులు చెప్తూ కబ్జాలు చేసే నాయకులను దూరం పెట్టండి
Kurnool: కర్నూలులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Kurnool: నీతులు చెప్తూ కబ్జాలు చేసే నాయకులను దూరం పెట్టండి
Kurnool: కేవలం స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తూ నీతులు చెబుతూ కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకులను ప్రజలు దూరంగా ఉంచాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా వివాహ బంధంతో ఒకటైన 60 జంటలను ఆయన ఆశీర్వదించి 80 వేల రూపాయల నగదు చెక్కులను అందించారు. మౌర్య ఇన్ హోటల్ పరిణయ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ తోసహా టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాజకీయాలలో మంచివారు ఉంటారని, అలాగే స్వార్థంతో బురద చల్లేవారు కూడా ఉంటారని అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలలో కూడా ఒకరిద్దరూ పనికిమాలిన వారు ఉంటారని అటువంటి వారికి సరైన రీతిలో స్పందించకపోతే ఎగిరెగిరి పడుతూనే ఉంటారని అన్నారు. సేవ చేయాలి అన్న సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామని ఎంతో మంది రాజకీయ నాయకులు తమ ముందు కుప్పిగంతులు వేశారని,
అటువంటి వారందరినీ కట్టడి చేసి ఎక్కడ కూడా సేవా కార్యక్రమాలకు అడ్డుతగలకుండా చేసామని టీజీ వెంకటేష్ తెలిపారు. కుల మతాలకు అతీతంగా దశాబ్దాలుగా వివాహాలు జరిపిస్తున్నామని, అలాగే ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నామని ఇది ప్రజలు గుర్తించుకోవాలన్నారు. ఎటువంటి వ్యాపారాలు లేకుండా కేవలం స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తూ కొంత మంది ప్రజల మధ్యన చిచ్చులు పెడుతూ లబ్ధి పొందుతున్నారని అన్నారు.
అటువంటి వారిని గుర్తించి ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వారినే ఎన్నుకోవాలని అప్పుడే నగర అభివృద్ధి తో పాటు, శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయని టీజీ వెంకటేష్ తెలిపారు. ఇక నూతనంగా వివాహ బంధంతో ఒకటి అయ్యేవారు చెడు అలవాట్లకు లోను కాకుండా జాగ్రత్తగా జీవితం కొనసాగించాలన్నారు. చిన్న వయసులో చెడు అలవాట్లకు లోనయితే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని టీజీ వెంకటేష్ తెలిపారు. తను ఎమ్మెల్యేగా కర్నూల్ నగర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానన్నారు.
సొంత నిధులతో పాఠశాలలకు అదనపు గదులు, ఇండోర్ స్టేడియాలు, కళ్యాణ మండపాలు నిర్మించినట్టు టీజీ తెలిపారు. అలాగే తుంగభద్ర నదీ తీరం వెంబడి రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేందుకు కృషి చేశామని తెలిపారు. అదే బాటలో మంత్రి టీజీ భరత్ నగర అభివృద్ధికి తన వంతుగా ఎంతగానో కృషి చేస్తున్నాడని తెలిపారు. హంద్రీ నది వెంట రింగ్ రోడ్డు నిర్మాణానికి మంత్రి భరత్ శ్రీకారం చుట్టాడని ఇవి రెండు పూర్తి అయితే నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉంటుందని అన్నారు.
అలాగే సొంత నిధులతో రెడ్ క్రాస్ భవన సముదాయంలోనే తల సేమియా వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేక భవనాన్ని కోటి రూపాయలతో నిర్మిస్తున్నామని దానికి మంత్రి టీజీ భరత్ ఈరోజే శంకుస్థాపన చేశారని ఆయన తెలిపారు. నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కర్నూలు అభివృద్ధికై పాటుపడుతున్న తమను నగర ప్రజలు గుర్తించి ఆదరించాలని టీజీ వెంకటేష్ కోరారు.




