Nandyal: ప్రభుత్వ ఆఫీసులో మందు పార్టీ.. నంద్యాలలో కలకలం!

Nandyal: నంద్యాల జిల్లా నూనెపల్లిలోని కొత్త ఎంఈఓ కార్యాలయ భవనంలో మద్యం, బిర్యానీ విందు కలకలం.

R Pavankalyan, Nandyal
Published on: 27 Jun 2026 3:27 PM IST
Nandyal
X

Nandyal: ప్రభుత్వ ఆఫీసులో మందు పార్టీ.. నంద్యాలలో కలకలం!

నంద్యాల జిల్లా: ప్రభుత్వ భవనాల్లోనే మద్యం పార్టీలా..?ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై ఆగ్రహం.నూనెపల్లిలో ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో మద్యం విందు కలకలం..బాధ్యత ఎవరిది..? అధికారుల వివరణతో కొత్త ప్రశ్నలు.. హెచ్ఎంటీవీ కెమెరాకు చిక్కిన ప్రభుత్వ కార్యాలయంలో మద్యం సేవిస్తున్న దృశ్యాలు..

ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయా..? నంద్యాల నూనెపల్లిలో చోటుచేసుకున్న ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.నంద్యాల జిల్లా పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, మండల పరిషత్ కార్యాలయాల సమీపంలోని నూతన మండల విద్యాధికారి కార్యాలయ భవనంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ బిర్యానీతో విందు చేసుకున్న ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ప్రజా ధనంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ప్రజల సేవకే పరిమితం కావాలి. కానీ అలాంటి ప్రదేశాల్లో మద్యం సీసాలు, ఆహార పొట్లాలు కనిపించడం అధికారుల పర్యవేక్షణపై అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళల్లో ప్రభుత్వ ఆస్తుల భద్రత ఎలా ఉంది..? ఎవరు పర్యవేక్షిస్తున్నారు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి..

ఘటన సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు స్థానిక రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో రాజకీయ అండ ఉందా..? లేక భద్రతా లోపమా..? అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి..

ఈ ఘటనపై వివరణ ఇచ్చిన విద్యాశాఖ అధికారులు, నూతన మండల విద్యాధికారి కార్యాలయం ఇంకా ప్రారంభం కాలేదని, భవనం అధికారికంగా తమ శాఖ ఆధీనంలోకి రాలేదని తెలిపారు. అయితే భవనం ఇంకా హ్యాండోవర్ కాకపోతే దాని భద్రత బాధ్యత ఎవరిది..? ఎవరూ పర్యవేక్షించకపోతే ఇలాంటి ఘటనలు మరెన్ని చోటుచేసుకుంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది..

ప్రభుత్వ ఆస్తులను కొందరు వ్యక్తులు తమ ఇష్టానుసారం వినియోగిస్తున్నారన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు అప్రమత్తమై ప్రభుత్వ భవనాల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story