Kurnool: తెలుగు భాష, సంస్కృతికి మండలి వెంకట కృష్ణారావు సేవలు చిరస్మరణీయం!

Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Aug 2026 4:50 PM IST
Kurnool
X

Kurnool: తెలుగు భాష, సంస్కృతికి మండలి వెంకట కృష్ణారావు సేవలు చిరస్మరణీయం!

కర్నూలు: స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, మాజీ మంత్రి, తెలుగు భాషా–సాంస్కృతిక వికాసానికి విశిష్ట సేవలందించిన దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా ఆయన సేవలను ఘనంగా స్మరించుకున్నారు.

మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పర్యాటక శాఖ మరియు సెట్కూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి తిరుమల నాయుడు, సెట్కూరు సీఈవో వేణుగోపాల్ మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ అధికారి తిరుమల నాయుడు మాట్లాడుతూ...మండలి వెంకట కృష్ణారావు 1926 ఆగస్టు 4న కృష్ణా జిల్లా కైకలూరు మండలం పల్లెవాడ గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశలోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. అనంతరం ప్రజాసేవలోకి అడుగుపెట్టి 1972లో అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివిసీమ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేసి "దివిసీమ గాంధీ" గా ప్రజల అభిమానాన్ని పొందారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ కోట్టే చెన్నయ్య మాట్లాడుతూ...ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మండలి వెంకట కృష్ణారావు 1955లో బంజరు భూముల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి సుమారు 15 వేల ఎకరాల భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.

1974లో విద్యా, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మండలి వెంకట కృష్ణారావు తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి విశేష కృషి చేశారు. 1975లో హైదరాబాద్‌లో నిర్వహించిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు కార్యనిర్వాహక అధ్యక్షునిగా సమర్థవంతంగా నాయకత్వం వహించారు.

అదే ఏడాది ఏర్పాటైన అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి తొలి అధ్యక్షునిగా సేవలందించి, తెలుగు భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మండలి వెంకట కృష్ణారావు విశిష్ట సేవలను గుర్తించిన ప్రభుత్వం అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి "మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం" గా నామకరణం చేసింది. అలాగే దివిసీమలోని పులిగడ్డ–పెనుమూడి వంతెనకు ఆయన పేరు పెట్టి ప్రజాసేవకు శాశ్వత గుర్తింపునిచ్చింది.

ప్రజాసేవ, గాంధేయ సిద్ధాంతాలు, తెలుగు భాషాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణకు మండలి వెంకట కృష్ణారావు అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో కొనసాగించడం ద్వారా సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ జన్మ దిన వేడుకలకు రాయల అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ, సెక్రటరీ కోనేటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ పి ఆర్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్ , వ్యాపారవేత్తలు భాస్కర్ , బాబు, ఆర్జారామకృష్ణ, విజయభాస్కర్, రెడ్డిని లక్ష్మీనారాయణ, సినీనటి విజయలక్ష్మి, డా.. రంగనాయకులు, డా..సోమశేఖర్, శ్రీకాంత్ శ్రీ అంచ పెద్ద స్వామి, శ్రీనివాసులు కర్నూలు బలిజ సంఘం నాయకులు గాండ్ల లక్ష్మన్న బలిజ సంఘం, సహదేవుడు, చంద్రమోహన్, మండ్లెం రవి కుమార్, ప్రకాష్, చింతల జ్యోతిర్మయి, కామిని వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story