Kurnool: 80 అడుగుల జాతీయ జెండా.. 600 మంది విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ!

Kurnool: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో 80 అడుగుల జాతీయ జెండాతో 600 మంది విద్యార్థుల ర్యాలీ జరిగింది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 14 Aug 2026 10:34 PM IST
Kurnool
X

Kurnool: 80 అడుగుల జాతీయ జెండా.. 600 మంది విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ!

కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో 600 మంది విద్యార్థులతో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గౌరీ చరిత, సెట్కూర్ CEO డాక్టర్ వేణుగోపాల్, APEWIDC డైరెక్టర్ నాగముని పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గౌరీ చరిత మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సెట్కూర్ CEO డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ, యువత దేశానికి భవిష్యత్ నాయకత్వాన్ని అందించాల్సిన బాధ్యత కలిగి ఉందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని మంచి ఉద్యోగాలు సాధించడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. జాతీయ పతాకం మన దేశ ఐక్యతకు, గౌరవానికి ప్రతీక అని తెలిపారు.

APEWIDC డైరెక్టర్ నాగముని మాట్లాడుతూ, వృత్తి విద్య ద్వారా విద్యార్థులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని స్వయం సమృద్ధి సాధించాలని అన్నారు. దేశ ప్రగతిలో నైపుణ్యం కలిగిన యువత కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి దేశం పట్ల బాధ్యత, కర్తవ్య భావనతో ముందుకు సాగాలని సూచించారు.

ర్యాలీ మార్గం

ఈ తిరంగా ర్యాలీ బి. క్యాంప్ నుండి ప్రారంభమై, సి. క్యాంప్ వైపు సాగుతూ గాయత్రి ఎస్టేట్ మీదుగా, అక్కడి నుంచి బిర్లా గేట్ వరకు కొనసాగింది. అనంతరం బిర్లా గేట్ నుంచి తిరిగి బి. క్యాంప్ సర్కిల్ మీదుగా కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంది.

ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డాక్టర్ ఎస్. నాగస్వామి నాయిక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. మల్లికార్జున, విజయశేఖర్, కృష్ణమోహన్, సోమేశ్, శారదీ పటేల్, ఉల్గోజీ రావు, శ్రీధర్ మూర్తి, బాల శంకర్, సుజాత, గిరిజా రాణి, సాయి శ్రావణి, జసింత, లావణ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు. 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story