Sanjamala: సంజామల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి!
Sanjamala: నంద్యాల జిల్లా సంజామల మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా జరిగిన పంట నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, కరువు మండలంగా ప్రకటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
Sanjamala: సంజామల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి!
Sanjamala: నంద్యాల జిల్లా సంజామల మండలంలో ఖరీఫ్–2026 సీజన్లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, తేమ లోపం, ఎల్నినో ప్రభావంతో సంభవించిన పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని కరువు ప్రభావిత మండలంగా ప్రకటించాలని రాష్ట్ర రోడ్లు–భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కు అక్టోబర్ 2న మంత్రి అధికారికంగా లేఖ రాశారు.
నంద్యాల జిల్లా ఆర్థిక, గణాంకాల అధికారి నివేదిక ప్రకారం సంజామల మండలంలో ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే 53.4 శాతం తక్కువగా నమోదైందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. అయితే నిర్దేశిత డ్రౌట్ అసెస్మెంట్లోని తప్పనిసరి ట్రిగ్గర్–1కు అవసరమైన డ్రై స్పెల్ ప్రమాణం పూర్తి కాలేదని తెలిపారు.
అదే సమయంలో, ఆగస్టు 31, 2026 నాటికి అందుబాటులో ఉన్న కరువు అంచనా వివరాల ప్రకారం సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే సంజామల మండలంలో వాస్తవ పంటల సాగు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. సాగు చేసిన పంటలు తేమ లోపం, అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి సమర్పించిన క్షేత్రస్థాయి నివేదిక ప్రకారం పంట నష్టం సుమారు 75 శాతంగా అంచనా వేయబడిందని, ఇది తీవ్ర నష్టం కేటగిరీలోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి సూచికలు, ప్రభావ సూచికలు, క్షేత్రస్థాయి నివేదికలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని సంజామల మండలాన్ని ఖరీఫ్–2026కు కరువు ప్రభావిత మండలంగా ప్రకటించాలని మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి కోరారు.
మండలాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కరువు నివారణ, ఉపశమన చర్యల కింద సహాయం అందే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.




