Nandyal: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్!
Nandyal: జిల్లాలో పదో తరగతిలో 589 మార్కులు సాధించిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని సమంతకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇచ్చిన మాట ప్రకారం 3 గ్రాముల బంగారం అందజేశారు.
Nandyal: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్!
నంద్యాల: మాట ఇచ్చి.. నిలబెట్టుకున్నారు మంత్రి ఎన్ఎండి ఫరూక్. పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి ప్రకటించిన బంగారు బహుమతిని అందజేసి అభినందించారు. నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ సమక్షంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది.
విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గత ఫిబ్రవరిలో ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. 2026 పదో తరగతి పరీక్షల్లో 585 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, కస్తూర్బా పాఠశాలల బాలికల్లో ఒకరికి 3 గ్రాముల బంగారం బహుమతిగా అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం, నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివి పదో తరగతిలో 589 మార్కులు సాధించి ప్రతిభ చాటిన నందిగ్రామ సమంతకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ 3 గ్రాముల బంగారు కమ్మలను బహూకరించారు.నంద్యాల చాబోలు రోడ్డులోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి సమక్షంలో మంత్రి ఈ బహుమతిని అందజేసి విద్యార్థినిని అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థినులు చదువులో రాణించాలని, వారిలో ఆత్మవిశ్వాసం, పోటీ స్ఫూర్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ బహుమతిని ప్రకటించినట్లు తెలిపారు. సమంత సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రెడ్డి, ఉర్దూ డీఐ అస్ముద్దీన్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




