Kurnool: కర్నూలులో గిన్నిస్ రికార్డ్ విద్యావేత్త జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ జీవిత చరిత్ర గ్రంథాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత ఆవిష్కరించారు.
Kurnool: కర్నూలులో గిన్నిస్ రికార్డ్ విద్యావేత్త జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ
కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ప్రముఖ విద్యావేత్త, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపు పొందిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ కార్యక్రమం సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారు గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ విద్యా రంగంలో అందించిన విశిష్ట సేవలు, విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని కొనియాడారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో గణనీయంగా అడ్మిషన్లు పెరగడం పట్ల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలల్లో ఈ కళాశాల ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమని పేర్కొంటూ, ఈ ఘనత సాధించిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, కళాశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, ఉపాధి అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులకు ఉత్తమ విద్య, నైపుణ్య శిక్షణ అందించి కళాశాలను రాష్ట్రంలోనే ఆదర్శ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, సోమేశ్, సారథి పటేల్, శ్రీధర్ మూర్తి, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.




