Panyam: హర్ ఘర్ తిరంగా జెండాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి!

Panyam: పాణ్యంలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కమిషనర్ చల్లా ఓబులేసు ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 14 Aug 2026 1:56 PM IST
Panyam
X

Panyam: హర్ ఘర్ తిరంగా జెండాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి!

Panyam: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేద్దామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి పెద్దపాడు రస్తాలోని సన్ రైస్ హోమ్స్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా మొక్కలు నాటి, హర్ ఘర్ తిరంగా లక్ష్యంగా ప్రజలకు జాతీయ త్రివర్ణ పతాకాలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా ప్రతి కుటుంబం తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశం పట్ల గౌరవం, బాధ్యతను ప్రతి ఒక్కరూ చాటాలని సూచించారు. ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు.

జాతీయ జెండా మన దేశ గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని, త్రివర్ణ పతాకం ప్రతి ఇంటిపై రెపరెపలాడేలా ప్రజలు తమ వంతు బాధ్యతగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. అదేవిధంగా స్వచ్ఛమైన, పచ్చని కర్నూలు నగర నిర్మాణంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కమిషనర్ తెలిపారు.

నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు 70 వేల మొక్కలు నాటే లక్ష్యంతో కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి భవిష్యత్ తరాలకు పచ్చని నగరాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేవలం ఒక వేడుకగా కాకుండా దేశం పట్ల మన బాధ్యతను గుర్తుచేసే రోజుగా ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ కృష్ణలత, ఏఈ రాజేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆలీం బాష తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story