Kurnool: కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు మార్క్ పాలన!

Kurnool: కర్నూలు నగరంలో పారిశుద్ధ్య ప్రక్షాళనకు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు శ్రీకారం చుట్టారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 6 Aug 2026 9:59 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు మార్క్ పాలన!

కర్నూలు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరపాలక సంస్థకు ఇద్దరు కమిషనర్లు వచ్చి వెళ్లినప్పటికీ, పారిశుద్ధ్య వ్యవస్థలో ఆశించిన స్థాయిలో మార్పులు కనిపించలేదు. అయితే ప్రస్తుత కమిషనర్ చల్లా ఓబులేసు పారిశుద్ధ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 3 నుంచి 4 గంటల పాటు క్షేత్రస్థాయిలోనే పర్యటిస్తూ, పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించడంతో పాటు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుండి నడిపిస్తున్నారు.

తొలుత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించారు. గ్లౌజులు, మాస్క్‌లు, ఏప్రాన్లు, రెయిన్‌కోట్లు, సబ్బులు, ఆయిల్, దుస్తులు, టవాల్స్, చెప్పులు, చీరలను పంపిణీ చేశారు. అదే సమయంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు సుమారు 4 వేల డస్ట్‌బిన్‌లు, 88 వీల్‌బారోలు, బొంగు రేకులు, సలికలు, పారలు తదితర పనిముట్లను ప్రతి కార్మికుడికి అందజేశారు. ఇందుకోసం దాదాపు రూ. కోటిన్నర మేర వ్యయం చేసి అవసరమైన సామగ్రిని సమకూర్చారు.

నిత్యం అధికంగా చెత్త ఉత్పత్తి అయ్యే మార్కెట్ యార్డులు, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసేందుకు 20 ట్రాలీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో భారీగా పేరుకుపోయే చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా సమర్థవంతంగా నియంత్రించగలిగారు. పదేపదే హెచ్చరించినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేస్తున్న వారికి జరిమానాలు విధించారు. జనావాసాల మధ్యలో చెత్త వేస్తున్న ప్రాంతాల్లో 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.

పారిశుద్ధ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తూ లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దడంలో చురుకుగా వ్యవహరించే శానిటేషన్ ఇన్‌స్పెక్టర్‌కు సూపర్‌వైజర్‌గా బాధ్యతలు అప్పగించారు. పారిశుద్ధ్య వాహనాల మరమ్మతులకు గతంలో వారాల తరబడి సమయం పట్టే పరిస్థితికి ముగింపు పలుకుతూ, ఒకే రోజులో మరమ్మతులు పూర్తి చేసే ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి డివిజన్ అవసరాలకు అనుగుణంగా వాహనాలను కేటాయిస్తూ పారిశుద్ధ్య వ్యవస్థలో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టారు. త్వరలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 91 ఈ-ఆటోలను రప్పించేందుకు మంత్రి టీజీ భరత్ సహకారంతో గుత్తేదారుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

పారిశుద్ధ్య పర్యవేక్షణ సిబ్బంది తప్పనిసరిగా క్షేత్రస్థాయిలోనే ఉండాలని, నగరంలో 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాల్సిందేనని కమిషనర్ పదేపదే స్పష్టం చేస్తున్నారు. ప్రతి చెత్త సేకరణ కార్మికుడి వద్ద ఎనిమిది డస్ట్‌బిన్‌లు తప్పనిసరిగా ఉండాలని, మైక్రో ప్యాకెట్ పరిధిలో 100 శాతం కవరేజీ సాధించేలా పిన్ పాయింట్ ప్రోగ్రామ్‌ను పక్కాగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యల ఫలితంగా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

కమిషనర్ నిరంతర క్షేత్రస్థాయి పర్యటనల ఫలితంగా నగరంలోని అనేక గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లు పూర్తిగా రూపుదిద్దుకున్నాయి. వినాయక ఘాట్ వద్ద కే.సి. కెనాల్, కల్లూరు వద్ద వక్కెర వాగు, రాజ్ విహార్ సమీపంలోని హంద్రీ నది ఇరువైపుల ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తూ కిందిస్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకోవడంతో అవి ప్రస్తుతం పరిశుభ్రంగా మారాయి. అలాగే కొండారెడ్డి బురుజు వద్ద పూలబజార్ వెనుక భాగం, ఇందిరమ్మ కట్ట, రివర్ వ్యూ కాలనీ, ముజఫర్ నగర్, వై. జంక్షన్ తదితర ప్రాంతాల్లోని జీవిపిలను వ్యూహాత్మకంగా పూర్తిస్థాయిలో తొలగింపజేశారు.

ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా కే.సి. కెనాల్, సుద్దవాగు, హంద్రీ నదుల్లో పూడికతీత పనులను ముమ్మరంగా చేపట్టారు. ఒమేగా ఆసుపత్రి ఎదురుగా వర్షపు నీరు రోడ్డుపై నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సమయంలో, ధైర్యంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని గుర్తించి, ఆ నీటిని పక్కనున్న పొలాల వైపు మళ్లించడం ద్వారా సమస్యకు సాహసోపేత పరిష్కార మార్గాన్ని చూపించారు. అదేవిధంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మురుగునీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించి, నీటి పారుదల సుగమం అయ్యేలా చర్యలు చేపట్టారు.

జాతీయ రహదారుల నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గాల పరిశుభ్రతను సంబంధిత జాతీయ రహదారుల అధికారుల బాధ్యతగా వదిలేయకుండా, నగర స్వచ్ఛతకు అవే ముఖద్వారాలన్న భావనతో నగరపాలక సంస్థే బాధ్యత తీసుకొని ప్రత్యేక చర్యలు చేపట్టింది. నగరంలోకి ప్రవేశించే ప్రతి మార్గం పరిశుభ్రతను ప్రతిబింబించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేస్తున్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story