Kurnool: జనగణనకు సహకరించండి.. కర్నూలు కమిషనర్ పిలుపు

Kurnool: కర్నూలు నగరంలో జనగణన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోనే 35.07 శాతం పూర్తి చేసి నగరం మొదటి స్థానంలో ఉందని కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 10 May 2026 5:37 PM IST
Kurnool
X

Kurnool: జనగణనకు సహకరించండి.. కర్నూలు కమిషనర్ పిలుపు

కర్నూలు: నగర పరిధిలో జనగణనలో భాగంగా తొలి విడతగా ఇంటిగణన చేపట్టడానికి ప్రజల వద్దకు వస్తున్న ఎన్యూమరేట్లకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. ఆదివారం ఆయన కింగ్ మార్కెట్, ఖండేరి వీధి ప్రాంతాల్లో ఇంటిగణన ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి జనగణన ఎంతో ముఖ్యమని, రాబోయే పదేళ్ల కాలానికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనకు ఇది ఎంతో అవసరమన్నారు. నగర పరిధిలో 911 మంది ఎన్యూమరేట్లు ఇంటిగణన నిర్వహిస్తున్నారని, వారిని 151 మంది సూపర్వైజర్లు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు‌. నగర పరిధిలో ఇప్పటివరకు 35.07 శాతం జనగణన పూర్తై రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నామని, మే 31 లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందన్నారు.

ఇళ్ల వద్దకు ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు స్వీయ గణనలో పాల్గొన్న వారు ఎస్‌ఈఐడి నంబర్ ఇవ్వాలని, స్వీయ గణనలో పాల్గొనని వారు ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలు అందించాలని సూచించారు. ఆధార్ నంబర్, ఓటీపీలు, బ్యాంకు వివరాలు వంటి సమాచారాన్ని ఎన్యూమరేటర్లు అడగరని స్పష్టం చేశారు. సిబ్బంది తప్పనిసరిగా ఐడి కార్డులు ధరించి ఉంటారని, అనుమానం ఉన్నప్పుడు ఐడి కార్డులు పరిశీలించాలని సూచించారు.

ప్రజలందరూ బాధ్యతతో సహకారం అందించాలని, త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుద్దామని కమిషనర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story