Kurnool: కేసీ కెనాల్ వద్ద దోమల నివారణకు డ్రోన్ల వినియోగం కమిషనర్!
Kurnool:కర్నూలు కేసీ కెనాల్ బండ్‌పై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు
Kurnool: కేసీ కెనాల్ వద్ద దోమల నివారణకు డ్రోన్ల వినియోగం కమిషనర్!
కర్నూలు: నగర పరిధిలోని కేసీ కెనాల్ బండ్‌పై ఉన్న ఆక్రమణలను సంబంధిత వ్యక్తులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనిపక్షంలో నగరపాలక వాటిని తొలగించే చర్యలు చేపడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. గురువారం ఆయన జొహరాపురం నుంచి ఆనంద్ టాకీస్ సమీపం వరకు కేసీ కెనాల్‌కు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు, గుర్రపు డెక్క (హార్స్‌టెయిల్) మొక్కలను పరిశీలించి, వాటి తొలగింపునకు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక విభాగాల అధికారులు సమన్వయంతో కేసీ కెనాల్ పరిసరాలను మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. గుర్రపు డెక్క (హార్స్‌టెయిల్) మొక్కల తొలగింపు పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యే వరకు దోమల నివారణ కోసం డ్రోన్ ద్వారా లార్వీసైడ్ మందును పిచికారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కేసీ కెనాల్ బండ్‌పై ఆక్రమణలు ఏ పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసిన కమిషనర్, సంబంధిత వ్యక్తులు వెంటనే స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోవాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో నగరపాలక సంస్థ స్వయంగా ఆక్రమణలను తొలగించి, అక్కడ ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు.
అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన కమిషనర్, షరాఫ్ బజార్‌లో ప్రతి వాణిజ్య దుకాణం వద్ద డస్ట్‌బిన్ ఏర్పాటు చేసి పరిశుభ్రతను పాటిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. షరాఫ్ బజార్‌ను ఆదర్శంగా తీసుకుని నగరంలోని ప్రతి వాణిజ్య దుకాణదారుడు తప్పనిసరిగా డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటరీ సూపర్వైజర్ రమేష్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు జిలాని, నాగేశ్వరరావు, ఫరూక్, హుస్సేన్, అనిల్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.




