Nagarkurnool: నాగర్‌కర్నూల్ 111 బస్తాల అనుమానాస్పద డీఏపీ సీజ్
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా మహదేవునిపేటలో అనుమానాస్పద డీఏపీ ఎరువుల కలకలం. 111 బస్తాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. నిందితులపై కఠిన చర్యలకు కలెక్టర్ ఆదేశం.
Nagarkurnool: నాగర్‌కర్నూల్ 111 బస్తాల అనుమానాస్పద డీఏపీ సీజ్
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో అనుమానాస్పద డీఏపీ ఎరువుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల ఇళ్లలో నిల్వ ఉంచిన 111 బస్తాల అనుమానాస్పద డీఏపీ ఎరువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇప్పటికే పంట పొలాల్లో వినియోగించిన 39 ఖాళీ డీఏపీ సంచులను కూడా దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ శుక్రవారం మహదేవునిపేటకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్వాధీనం చేసుకున్న డీఏపీ బస్తాలను తనిఖీ చేసి వ్యవసాయ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఈ ఎరువులు ఎలా చేరాయి, వాటి సరఫరా వెనుక ఎవరున్నారు అనే అంశాలపై అధికారులతో చర్చించారు.
వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు మార్కెట్ ధర కంటే తక్కువగా రూ.1,600 నుంచి రూ.1,700 వరకు ఒక బస్తా చొప్పున విక్రయించడంతో గ్రామానికి చెందిన ఏడుగురు రైతులు వాటిని కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, స్వాధీనం చేసుకున్న డీఏపీ బస్తాల నుంచి నమూనాలు సేకరించి వెంటనే హైదరాబాద్‌లోని గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా నివేదికల ఆధారంగా ఎరువులు నకిలీవని తేలితే ఎరువుల నియంత్రణ చట్టం సహా సంబంధిత చట్టాల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను బిజినపల్లి రైతు వేదికలో భద్రపరచాలని ఆదేశించారు.
అదేవిధంగా ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని జిల్లా పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నకిలీ ఎరువుల సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, అవి జిల్లాలో మరెక్కడైనా విక్రయించారా అనే అంశాలను పూర్తిగా విచారించి నివేదిక సమర్పించాలని సూచించారు. అవసరమైతే కర్ణాటక రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుని దర్యాప్తు నిర్వహించాలని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ మాట్లాడుతూ, రైతులను మోసం చేసే నకిలీ ఎరువుల వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు సూచనలు చేస్తూ, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను తప్పనిసరిగా లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలుకు బిల్లు తీసుకోవాలని సూచించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నారని నమ్మి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. నకిలీ ఎరువుల విక్రయాలపై జిల్లాలో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.




