Atmakur: స్మగ్లర్లు దాచిన టేకు కలపను అమ్ముకున్న అటవీ అధికారులు!
Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్‌లో సంచలన ఘటన వెలుగుచూసింది.
Atmakur: స్మగ్లర్లు దాచిన టేకు కలపను అమ్ముకున్న అటవీ అధికారులు!
ఆత్మకూరు: భారతదేశంలోనే అతి పెద్ద పెద్ద పులుల సంరక్షణ అభయారణ్యం నాగార్జునసాగర్- శ్రీశైలం అభయారణ్యంలో వన్యప్రాణి వేటగాళ్లు, టేకు కలప స్మగ్లర్లు ఏ క్షణాన విజృంభిస్తారో నిఘా వర్గాలు కూడా పసి కట్టలేని పరిస్థితి. అయితే నిత్యం నల్లమలలో సంచరిస్తూ స్మగ్లర్లను వేటాడాల్సిన అటవీశాఖ కిందిస్థాయి అధికారులే స్మగ్లర్లు అక్రమంగా దాచిన టేకు కలపను తరలించుకొని వెళ్లి ప్రైవేటు టింబర్ డిపోలకు గుట్టుగా అమ్ముకున్న విషయం బయటకు పొక్కింది. దీంతో రహస్య విచారణ జరిపిన ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డ నలుగురు అటవీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ సంఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ వెలుగోడు రేంజ్ లో చోటు చేసుకుంది. వెలుగోడు అటవీ రేంజ్ అబ్రాసు కుంట సెక్షన్ లో స్మగ్లర్లు భారీ టేకు వృక్షాలను నరికి దాచారు. వాటిని స్వాధీనపరచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిన రేంజ్ అధికారులు, సిబ్బంది కుమ్మక్కై లక్షల రూపాయల విలువచేసే టేకు కలపను అటవీశాఖ వాహనాల్లోనే మోతుకూరు గ్రామంలో ఓ ప్రైవేటు టింబర్ డిపోకు తరలించి విక్రయించారు.
ఈ విషయాన్ని అటవీ శాఖలోని కొందరు ఉన్నతాధికారులకు ఒప్పందించారు. దీంతో రహస్య దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తు పోయే వాస్తవాలు బయటపడ్డాయి. స్మగ్లర్లు దాచిన టేకు కలపను అక్రమంగా తరలించిన వెలుగోడు రేంజ్ ఇంచార్జ్ ఎఫ్ ఆర్ ఓ తాహెర్, ఇద్దరూ ఎఫ్ ఎస్ ఓ లు జయరాజు, ఓకే వెంకటేశ్వర్లు, మరో ఎఫ్ బి ఓ. మయూరి ఈ నలుగురిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అటవీ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఇదే వెలుగోడు రేంజ్ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయిన అధికారి పంగిడి అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు నరికి దాచిన టేకు కలపను అమ్ముకున్నారు.
విషయం బయటపడడంతో మరో ప్రాంతంలో టేకు వృక్షాలను నరికించి స్మగ్లర్లు దాచిన టేకు కలపగా కట్టు కధ అల్లాడు. అప్పట్లో ఆ సంఘటన పెను సంచలనం రేకెత్తించింది. కానీ అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ సంఘటన అటవీశాఖ అధికారులు మరిచిపోక మునుపే అదే అటవీ ప్రాంతంలో మరో సంఘటన వెలుగు చూసింది.
డివిజనల్, సర్కిల్ స్థాయి ఉన్నతాధికారులు ఎంత కఠినంగా వ్యవహరించినా కిందిస్థాయి అధికారులు సిబ్బంది కుమ్మక్కై వన్యప్రాణుల వేటగాళ్ల, కలప స్మగ్లర్లతో చేతులు కలిపి నల్లమల సంపదను దోచుకుంటున్నారని పర్యావరణ, వన్యప్రాణి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




