Srisailam: నల్లమలలో రూ.18 వేల కోట్లతో 'టైగర్ ఎలివేటెడ్ కారిడార్'
Srisailam: నల్లమల అటవీ ప్రాంతంలో రూ. 18,000 కోట్లతో ప్రతిపాదించిన 86.74 కి.మీల 'టైగర్ ఎలివేటెడ్ కారిడార్' సాధ్యసాధ్యాలపై కేంద్ర వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేయనుంది.
Srisailam: నల్లమలలో రూ.18 వేల కోట్లతో 'టైగర్ ఎలివేటెడ్ కారిడార్'
Srisailam: రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన నల్లమల అడవుల గుండా స్తంభాల ఆధారంగా నిర్మించాల్సిన ఎలివేటెడ్ వంతెన కారిడార్ సాధ్య సుసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిద్ధపడింది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు, తెలంగాణలో హైదరాబాద్ వైపు నుంచి బ్రాహ్మణపల్లి - శ్రీశైలం డ్యామ్ ఈగలపెంట దిగువ వరకు జాతీయ రహదారి 765 విస్తరణకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ సిద్ధపడింది. నాలుగు వరసల హైవే నిర్మాణం వల్ల ఎక్కువ మొత్తంలో నల్లమల అడవుల భూభాగం కోల్పోతుంది. ఈ నష్ట నివారణకు 86. 74 కిలోమీటర్ల పొడవున భూమికి 30 అడుగుల ఎత్తులో వంతెనలతో కూడిన రహదారి నిర్మించేందుకు కేంద్ర పర్యావరణ, పెద్దపురుల సాధికారత సంస్థను జాతీయ రహదారుల నిర్మాణ విభాగం అనుమతి కోరింది.
అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేర సాధ్యం కాదని .. నల్లమలలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో రెండు పెద్ద పులుల సంరక్షణ అభయారణ్యాలలో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రస్తుతం ఉన్న భూ ఉపరితలంపై రహదారి నిర్మాణానికి అనుమతులు లేవని ఎన్ టి సి ఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఎన్ హెచ్ ఏ ఐ అభ్యర్థనతో పెద్ద పులుల ఆవాసాలు, సంచరించే ప్రదేశాలు ఇతర వన్యప్రాణుల సంరక్షణకు నష్టం వాటిల్లకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే.. ఎలాంటి చర్యలు తీసుకో వాలో అధ్యయనం చేసేందుకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓ కమిటీని ఏర్పాటుచేసి అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం పరిధిలో పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 41. 39 కి. మీ, తెలంగాణలో 45. 35 కి. మీ కలిపి మొత్తం 86. 74 కి. మీ మేర ఎలివేటెడ్ వంతెన నిర్మించేలా ప్రతిపాదించారు. ఇందుకు రూ. 18, 000 వేల కోట్ల ప్రాథమిక అంచనాలతో కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకరించింది. టైగర్ ఎలివేటెడ్ కారిడార్లలో పెద్ద పులులు ఎక్కువగా ఎటువైపు రాకపోకలు సాగిస్తుంటాయి, వాటి కదలికలు ఏ ప్రదేశాల్లో అధికంగా ఉంటాయో తదితర అంశాలపై ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిస్తుంది.
ఇప్పటికే 35 పేజీల ప్రాథమిక అంశాల నివేదిక ఎన్ టి సి ఏ వద్ద ఉంది. వన్యప్రాణులు రహదారులను దాటి ప్రదేశాల్లో అనిమల్ అండర్ పాస్ వంతెనలు, అభయారణ్యంలో శబ్ద కాలుష్యం, వాహనాల హెడ్లైట్ల వెలుగులు తదితర విషయాలపై నిపుణుల కమిటీ లోతుగా అధ్యయనం చేయనుంది. ఎలాంటి అధ్యయనాలు చేయాలన్నా జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతి తప్పనిసరి. అందుకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యయన నివేదికలు ఎంతో కీలకం కానున్నాయి.
ఈ అనుమతులు, అధ్యయనాలు ఓ కొలిక్కి వస్తే ఎలివేటెడ్ కారిడార్ వంతెన నిర్మాణంపై త్వరగా ముందడుగు పడే అవకాశం ఉందని జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులు అంటున్నారు. ఇటు ఆంధ్ర నుంచి, అటు తెలంగాణ నుంచి శ్రీశైలానికి రాత్రి 9గం. నుంచి ఉదయం 6 గం. ల వరకు వాహనాల రాకపోకలకు నల్లమల మీదుగా అనుమతి లేదు. ఎలివేటెడ్ కారిడార్ వంతెన అందుబాటులోకి వస్తే హైదరాబాదు నుంచి శ్రీశైలానికి, అక్కడినుంచి దోర్నాల మీదుగా తిరుపతి, చెన్నై వరకు 24 గంటలు వాహనాల రాకపోకలే కాకుండా.. రెండు రాష్ట్రాలు ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రాత్మక, పర్యాటక అభివృద్ధి చెందే వీలు కలుగుతుందని పౌరులు అభిప్రాయపడుతున్నారు.




