Nandyal: ఆత్మకూరులో రైతుల శంఖారావం - ఉద్రిక్తత
Nandyal: నంద్యాల జిల్లా ఆత్మకూరులో రైతుల శంఖారావం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యేలను, రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంతో మోతుకూరు వద్ద రాస్తారోకో నిర్వహించారు.
Nandyal: ఆత్మకూరులో రైతుల శంఖారావం - ఉద్రిక్తత
నంద్యాల: నంద్యాల జిల్లా ఆత్మకూరులో రైతుల శంఖారావం ఉద్రిక్తతకు దారితీసింది. వెలుగోడు రిజర్వాయర్ నీటిపై రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైతు శంఖారావానికి పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో నేటి శంఖారావం కార్యక్రమంలో భాగంగా రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో వెలుగోడు రిజర్వాయర్ ముట్టడికి బయలుదేరారు. రైతులతో కలిసి వెలుగోడు వైపు వెళ్తున్న శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని బండి ఆత్మకూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో పాటు రైతులను కూడా పోలీసులు ముందుకు వెళ్లకుండా నిలువరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెలుగోడు వైపు ముందుకు కదలడానికి అనుమతించబోమని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం.
దీంతో పోలీసులకు, మాజీ ఎమ్మెల్యేలకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తుండగా.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే అడ్డుకుంటున్నామని పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రైతులు ట్రాక్టర్లతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో బండి ఆత్మకూరు వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. భారీగా మోహరించిన పోలీసు బలగాలు రైతుల ట్రాక్టర్లను అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మోతుకూరు వద్ద రాస్తారోకో
ఇదిలా ఉండగా.. మోతుకూరు గ్రామం వద్ద మరో పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే శిల్పా కుమారుడు కార్తీక్ రెడ్డి రైతులతో కలిసి వెలుగోడు–నంద్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
రైతులకు సాగునీటి కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని రైతులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమకు నీరు అందించాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళన కారణంగా వెలుగోడు–నంద్యాల రహదారిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వెలుగోడు వైపు భారీ పోలీసు బందోబస్తు
రైతుల శంఖారావం నేపథ్యంలో వెలుగోడు రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో రిజర్వాయర్ వైపు తరలిరాకుండా ప్రధాన మార్గాల్లో పోలీసులను మోహరించారు.
ట్రాక్టర్లతో వచ్చే రైతులను పోలీసులు అడ్డుకుంటుండటంతో ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఒకవైపు రైతులు తమ నీటి హక్కుల కోసం ఆందోళనకు దిగగా.. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం బండి ఆత్మకూరు, మోతుకూరు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రైతుల శంఖారావం.. పోలీసుల అడ్డంకులు.. రాస్తారోకోతో ఆత్మకూరు ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.




