Nandyal: వైఎస్సార్ విగ్రహ రచ్చ.. శిల్పా బ్రదర్స్‌పై మంత్రి కామెంట్స్

Nandyal: నంద్యాల శ్రీనివాస సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహ పునఃప్రతిష్ఠ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

R Pavankalyan, Nandyal
Published on: 15 July 2026 8:19 AM IST
Nandyal
X

Nandyal: వైఎస్సార్ విగ్రహ రచ్చ.. శిల్పా బ్రదర్స్‌పై మంత్రి కామెంట్స్

Nandyal: నంద్యాల శ్రీనివాస సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ఠ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విగ్రహాల ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని, కానీ ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించేలా కూడళ్లలో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు.

నంద్యాల శ్రీనివాస సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు శిల్పా కుటుంబం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయడంపై రాష్ట్ర మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ స్పందించారు.

ఇదే ప్రదేశంలో సుమారు 25 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాను ప్రయత్నించానని, అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ వంటి మూడు పార్టీల్లో మారిన శిల్ప కుటుంబ నేతలు ఇప్పుడు విగ్రహాలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాబోయే రోజుల్లో వారు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడం బాధాకరమేనని పేర్కొన్న మంత్రి, విగ్రహాల ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

శ్రీనివాస సెంటర్‌లో గతంలో ఉన్నదానికంటే పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. విగ్రహం పరిమాణాన్ని తగ్గించి ఉంటే ప్రజల్లో మంచి పేరు వచ్చేదని వ్యాఖ్యానించారు.

శ్యామకాలువ జంక్షన్, సాయిబాబా నగర్ జంక్షన్‌ల వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో పాటు తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మంత్రి ఫరూక్ తెలిపారు.

అలాగే, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుకు అనుమతి కోరిన వారికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లోని ఎన్టీఆర్ విగ్రహం పక్కనే ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఇదే విధంగా మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story