Nandyal: నంద్యాలలో ఆరేళ్ల చిన్నారి అదృశ్యం సుఖాంతం

Nandyal: నంద్యాలలో అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి ప్రణవి కథ సుఖాంతమైంది.

R Pavankalyan, Nandyal
Published on: 20 July 2026 9:44 AM IST
Nandyal
X

Nandyal: నంద్యాలలో ఆరేళ్ల చిన్నారి అదృశ్యం సుఖాంతం

Nandyal: నంద్యాల జిల్లాలో ఓ ఆరేళ్ల చిన్నారి అదృశ్యం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లిపోయిన చిన్నారి ప్రణవి కోసం పోలీసులు రాత్రంతా భారీ గాలింపు చేపట్టారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన తాజాగానే ఉండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. డ్రోన్లు, జాగిలాలు, 200 మంది పోలీసులతో సాగిన గాలింపు చివరకు సుఖాంతమైంది. జొన్న చేనులో నిద్రపోతున్న ప్రణవి క్షేమంగా లభించడంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీస్ బృందాలు ఊపిరి పీల్చుకున్నాయి.

నంద్యాల పట్టణ శివారులోని వైఎస్ నగర్‌లో నివసించే ఆరేళ్ల చిన్నారి ప్రణవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లిపోయింది. తల్లి కళ్యాణి మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, ఇంటికి వచ్చేసరికి ప్రణవి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మొదట స్థానికంగా వైఎస్ నగర్ పరిసరాల్లో బంధువులు, స్థానికులతో కలిసి గాలించినా చిన్నారి ఆచూకీ లభించలేదు. దీంతో రాత్రి 9 గంటల సమయంలో తల్లి కళ్యాణి డయల్-100కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇటీవల తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

జిల్లా ఎస్పీ సునీల్ షొరాన్ స్వయంగా రాత్రంతా వైఎస్ నగర్‌లోనే మకాం వేసి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. దాదాపు 200 మంది పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వైఎస్ నగర్, నందమూరి నగర్, పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు.

డ్రోన్ కెమెరాలు, పోలీస్ జాగిలాలను రంగంలోకి దింపడంతో పాటు ప్రతి వీధిలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ప్రణవి ఒంటరిగా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు లభించాయి. అయినప్పటికీ రాత్రంతా గాలించినా చిన్నారి ఆచూకీ దొరకలేదు.

తెల్లవారుజామున గాలింపును మరింత విస్తరించిన పోలీసులు సమీపంలోని జొన్న చేల్లో కూంబింగ్ నిర్వహించారు. అక్కడ ఓ జొన్న చేనులో ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రణవి కనిపించింది.

చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు వెంటనే తల్లి కళ్యాణికి అప్పగించారు. ప్రణవి క్షేమంగా దొరకడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా, రాత్రంతా శ్రమించిన పోలీస్ అధికారులు, సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు.

కాకినాడ జిల్లా తుని ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల భద్రతపై ఆందోళనలు నెలకొన్న వేళ... నంద్యాలలో ఆరేళ్ల ప్రణవి అదృశ్యం మరోసారి ఉత్కంఠను రేపింది. అయితే జిల్లా పోలీసుల వేగవంతమైన స్పందన, రాత్రంతా సాగిన గాలింపు చర్యలతో చిన్నారి క్షేమంగా లభించడం అందరికీ ఊరటనిచ్చింది.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story