Srisailam: శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం!

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్ర పాలకుడైన శ్రీ బయలు వీరభద్రస్వామి వారికి ప్రదోషకాలంలో పంచామృతాలు, వివిధ ఉదకాలతో విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 18 Nov 2026 12:04 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం!

శ్రీశైల: శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించారు. ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడ్డాయి. బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది.

ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రిందివైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి.

ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం,బాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు. మంగళవారం, ఆదివారం మరియు అమావాస్య రోజులలో చేసే వీరభద్రపూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహపీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి.

ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM