Nandyal: శ్రీశైలం ఉద్యోగుల మానవత్వం: వృద్ధురాలికి భరోసా

Nandyal: నంద్యాల జిల్లా శ్రీశైలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్మణ్, గంగయ్యలు కాకినాడ వెళ్లి అనారోగ్య వృద్ధురాలికి పింఛను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 4 Aug 2026 10:13 AM IST
Nandyal
X

Nandyal: శ్రీశైలం ఉద్యోగుల మానవత్వం: వృద్ధురాలికి భరోసా

మానవత్వానికి మారుపేరుగా నిలిచిన శ్రీశైలం ఉద్యోగులు

వృద్ధురాలికి భరోసాగా నిలిచిన ఎం. లక్ష్మణ్, వై. గంగయ్య

శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో మానవత్వానికి మారుపేరుగా మరోసారి నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులు ​సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోందనీ, ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా మారుతున్న రోజులివి. తోటి మనుషుల కష్టాలను పట్టించుకునేవారే కరువవుతున్న ప్రస్తుత తరుణంలో, నంద్యాల జిల్లా శ్రీశైలం మండలానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉన్నతమైన సేవా గుణంతో యావత్ జిల్లా ప్రజల చేత 'శబాష్' అనిపించుకుంటున్నారు. బాధ్యత కేవలం కార్యాలయానికే పరిమితం కాదని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే అసలైన ప్రభుత్వ సేవ అని నిరూపించి ఆదర్శంగా నిలిచారు.

​అసలేం జరిగిందంటే...?

​శ్రీశైలం సున్నిపెంట గ్రామంలోని డామ్ మెయింటెనెన్స్ సర్కిల్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం. లక్ష్మణ్, అలాగే క్యాంప్సన్ బిల్డింగ్స్ డివిజన్‌లో పనిచేస్తున్న వై. గంగయ్య సేవాభావం మరోసారి ఉన్నత స్థానంలో నిలబడింది.

​నల్లమిల్లి పద్మావతి అనే వృద్ధ మహిళ గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ, ప్రస్తుతం కాకినాడ టౌన్‌లో నివసిస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె తన వృద్ధాప్య పింఛను డబ్బులను స్వయంగా వచ్చి శ్రీశైలం మండలంలో తీసుకునే పరిస్థితి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇరుగుపొరుగు వారితో ఈ విషయాన్ని గ్రహించిన ఆ ఇద్దరు ఉద్యోగులు లక్ష్మణ్, గంగయ్యలు చలించిపోయారు. క్షణం కూడా ఆలోచించకుండా హుటాహుటిన శ్రీశైలం నుండి కాకినాడకు పయనమయ్యారు.

​ఆపద్బాంధవులై... భరోసానిచ్చి...

​కాకినాడలో ఉన్న ఆ వృద్ధ మహిళ వద్దకు స్వయంగా వెళ్లిన ఈ ఇద్దరు ఉద్యోగులు, ఆమెకు తపస్సులా నిలిచి పెన్షన్ డబ్బులను అందజేశారు. కేవలం ఆర్థిక సహాయంతోనే సరిపెట్టకుండా, ఆమె అనారోగ్య పరిస్థితులను, ఇబ్బందులను సానుభూతితో ఆలకించారు. అంతేకాకుండా, రానున్న రోజుల్లో ఆ వృద్ధురాలికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఆమె పింఛనును ఇకపై కాకినాడ టౌన్‌లోనే నేరుగా పొందేలా స్థానిక మండల అధికారులతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేస్తామని గొప్ప భరోసా ఇచ్చారు.

​అభినందనల వెల్లువ

​కార్యాలయ విధులకు పరిమితం కాకుండా, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడకు వెళ్లి మరీ ఓ అభాగ్యురాలికి చేయూతనిచ్చిన ఈ ఇద్దరు ఉద్యోగుల మానవతా దృక్పథాన్ని నంద్యాల జిల్లా ప్రజలు, తోటి ఉద్యోగులు, స్థానికులు వేనోళ్ళ కొనియాడుతున్నారు. కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన ఎం. లక్ష్మణ్, వై. గంగయ్యల సేవలు ప్రభుత్వ ఉద్యోగులందరికీ గర్వకారణం, ఆదర్శనీయం.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story