Nandyal: వక్ఫ్ భూముల బదలాయింపుపై ముస్లిం నేతల ఆగ్రహం
Nandyal: నంద్యాల జిల్లాలో వక్ఫ్ ఆస్తుల కేటాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
Nandyal: వక్ఫ్ భూముల బదలాయింపుపై ముస్లిం నేతల ఆగ్రహం
Nandyal: నంద్యాల జిల్లాలో వక్ఫ్ ఆస్తుల కేటాయింపు వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి N. M. D. ఫరూక్ వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ మండిపడ్డారు.
నంద్యాల స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన ముస్లిం మైనారిటీ నేతల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మా బున్నీసా, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, సలాముల్లా, గన్నీ కరీం, ఎం. గౌస్, దేవనగర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో నేతలు వక్ఫ్ బోర్డు ఆస్తుల కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌలూరు గ్రామ ఈద్గా పరిధిలో వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న 10 ఎకరాల భూమిని కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ…“అల్లా పేరిట వక్ఫ్‌గా ఇచ్చిన భూములు కేవలం ముస్లింల మతపరమైన, సామాజిక అవసరాల కోసమే వినియోగించాలి. అలాంటి పవిత్ర ఆస్తులను కోర్టులు, ఇతర ప్రభుత్వ భవనాల కోసం కేటాయించడం ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం” అని అన్నారు.
అలాగే చాబోలు గ్రామం వద్ద ఉన్న 19 ఎకరాల 14 సెంట్ల వక్ఫ్ భూమిని పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు కేటాయించడాన్ని కూడా వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఫరూక్ వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సింది పోయి, వాటి బదలాయింపుకు సహకరించడం దారుణమని ఆరోపించారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం నంద్యాల జిల్లాలోని ముస్లింలంతా ఏకం కావాలని వైసీపీ మైనారిటీ నేతలు పిలుపునిచ్చారు. అవసరమైతే చట్టపరంగా, సామాజికంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నంద్యాలలో వక్ఫ్ ఆస్తుల వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.




