Nandyala: ఓటర్ల జాబితా పరిశీలన.. రంగంలోకి నంద్యాల కలెక్టర్!

Nandyala: నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామ సచివాలయ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కలెక్టర్ జి. రాజకుమారి స్వయంగా పరిశీలించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 May 2026 5:34 PM IST
Nandyala
X

Nandyala: ఓటర్ల జాబితా పరిశీలన.. రంగంలోకి నంద్యాల కలెక్టర్!

Nandyala: స్వచ్ఛమైన, నిర్దిష్టమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగంగా చేపట్టిన ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. బుధవారం దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామ సచివాలయ పరిధిలోని ఉమాపతినగర్‌లో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేసి, నమోదు ప్రక్రియపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మెట్టుపల్లి లక్ష్మి అనే మహిళ పేరు ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉండగా, 2022 జాబితాలో లేకపోవడం గమనించిన కలెక్టర్, సంబంధిత వివరాలను ఆరా తీశారు. ఆమెకు సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని సూచించగా, అధికారులు అక్కడికక్కడే పూర్తి చేశారు. అలాగే, ఆమె పుట్టినిల్లు బనగానపల్లె మండలం వెంకటాపురం గ్రామమని తెలుసుకున్న కలెక్టర్, అక్కడి పోలింగ్ స్టేషన్ నంబర్-169లో ఉన్న ఓటరు వివరాలను పరిశీలించి, కుటుంబ సభ్యుల వివరాలతో సహా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం గుండుపాపల సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్, సిబ్బందితో సమావేశమై ఓటరు మ్యాపింగ్, ఫీల్డ్ స్థాయి సర్వే విధానం, సెన్సస్ ప్రక్రియ అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ పరిధిలో సెన్సస్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఫీల్డ్ స్థాయిలో సిబ్బంది పనితీరు, ఇంటింటి ధృవీకరణ విధానం, ఓటరు మ్యాపింగ్ ఖచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, తప్పులులేని ఓటర్ల జాబితా తయారు చేయాలని సూచించారు. అలాగే, ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న పీఎంయూ యాప్ పనితీరు, డేటా నమోదు విధానం, సాంకేతిక సమస్యలపై కూడా సిబ్బందిని అడిగి తెలుసుకుని తగిన సూచనలు చేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story