Kurnool: రోగికి నాణ్యమైన వైద్యమే పరిశోధనల లక్ష్యం: వీసీ చంద్రశేఖర్

Kurnool: కర్నూలు మెడికల్ కాలేజీలో AP AROICON-2026 సదస్సు ప్రారంభమైంది. రోగికి నాణ్యమైన చికిత్స అందించడమే పరిశోధనల అంతిమ లక్ష్యమని డా. చంద్రశేఖర్ అన్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Sept 2026 9:44 PM IST
Kurnool
X

Kurnool: రోగికి నాణ్యమైన వైద్యమే పరిశోధనల లక్ష్యం: వీసీ చంద్రశేఖర్

కర్నూలు : వైద్య రంగంలో జరుగుతున్న ప్రతి పరిశోధన, ప్రతి సదస్సు, ప్రతి శాస్త్రీయ చర్చకు అంతిమ లక్ష్యం రోగికి ఖచ్చితమైన, అత్యుత్తమమైన, అధునాతన వైద్యం అందించడం తద్వారా రోగికి స్వాంతన కలిగించడమేనని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్‌ చాన్స్‌లర్ డా. పుల్లాల చంద్రశేఖర్ అన్నారు. శనివారం

కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూ లెక్చర్ గ్యాలరీలో అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా (AROI) ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో 7వ వార్షిక రాష్ట్రస్థాయి సదస్సు “AP AROICON–2026” శనివారం ప్రారంభమైంది. “ మేధావుల కలయిక, అనుభవాల పంపకం & గర్భాశయ మరియు స్రీ జననేంద్రియ క్యాన్సర్ చికిత్స యొక్క భవిష్యత్తును అన్వేషించడం".(sharing experiences & exploring the future of Gynaecological Cancer Care” )అనే అంశంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు AROI AP చాప్టర్ అధ్యక్షురాలు డా. ఎన్. సుజాత అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌చాన్స్‌లర్ డా. పుల్లాల చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2017లో కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు తాను పునాదిరాయి వేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అదే సంస్థ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుని క్యాన్సర్ రోగులకు సేవలందిస్తూ రాష్ట్రస్థాయి వైద్య సదస్సుకు వేదికగా నిలవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.

క్యాన్సర్ వైద్యం అత్యంత ఖరీదైనదిగా భావించినప్పటికీ, పేద ప్రజలకు కూడా అత్యాధునిక క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ద్వారా నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగా కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కోట్లాది రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సతో పాటు వైద్య పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైద్య పరిశోధనలకు రూ.30 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఫలితాలు చివరకు సామాన్య రోగికి ఉపయోగపడేలా ఉండాలని సూచించారు.

రాబోయే కాలంలో క్యాన్సర్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, పొగాకు వినియోగం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాద కారకాలను నియంత్రించుకోవాలని సూచించారు. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం ద్వారా చికిత్స ఫలితాలను మెరుగుపరచవచ్చని తెలిపారు.

“డబ్బు కోసం పరుగెత్తకండి.. పేరు, జ్ఞానం, సేవ కోసం పనిచేయండి”

కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత, అపోలో క్యాన్సర్ సెంటర్, హైదరాబాద్ డైరెక్టర్ డా. పి. విజయ్ ఆనంద్ రెడ్డి వైద్య విద్యార్థులు, యువ వైద్యులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు.

“డబ్బు కోసం పరుగెత్తకండి.. మంచి పేరు, జ్ఞానం, సేవ కోసం పనిచేయండి. మీరు సమాజానికి నిజాయితీగా సేవ చేస్తే డబ్బు మీ వెంట వస్తుంది” అని ఆయన అన్నారు.

విజయం ఒక్కరోజులో రాదని, తక్షణ ఫలితాల కోసం ఆరాటపడకుండా లక్ష్యంపై దృష్టి పెట్టి నిరంతరం కష్టపడాలని సూచించారూ.

తాను 31 సంవత్సరాల వయస్సు వరకు విద్య, ప్రత్యేక వైద్య విద్యను కొనసాగించి, 32 సంవత్సరాల వయస్సులో వైద్య వృత్తిని ప్రారంభించానని తెలిపారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆలస్యం గురించి ఆలోచించకుండా, ఎంచుకున్న రంగంలో అంకితభావంతో ముందుకు సాగాలని అన్నారు.

వైద్య వృత్తి ఇతర వృత్తుల కంటే ఎంతో ప్రత్యేకమైనదని, మానవ ప్రాణాలతో ముడిపడిన ఈ వృత్తిలో జ్ఞానంతో పాటు ప్రేమ, కరుణ, దయ, మానవత్వం, సేవాభావం అవసరమని తెలిపారు. రోగుల నుంచి లభించే ప్రేమ, విశ్వాసం, గౌరవం, ఆశీర్వాదాలను డబ్బుతో కొనలేమని అన్నారు.

“రోగులు చూపించే ప్రేమ, విశ్వాసం, గౌరవం వైద్యుడికి లభించే గొప్ప సంపద. అలాంటి గౌరవం ప్రతి వృత్తిలోనూ లభించదు. దానిని డబ్బుతో సంపాదించలేం.. సంవత్సరాల పాటు చేసే కృషి, జ్ఞానం, అంకితభావం, సేవ, మానవత్వంతో మాత్రమే సంపాదించుకోవచ్చు” అని తెలిపారు.

కష్టపడి పనిచేయడాన్ని భారంగా భావించకూడదని, కష్టపడి పనిచేయడం జీవితంలో ఒక భాగంగా మారాలని సూచించారు. మనిషికి లభించిన జీవితాన్ని కేవలం వినోదానికి, సమయాన్ని వృథా చేయడానికి కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి వినియోగించుకోవాలని అన్నారు.

“మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించండి. నిరంతరం నేర్చుకోండి, కష్టపడండి, సమాజానికి మీ వంతు సేవ చేయండి. మీరు ఎంచుకున్న రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయండి” అని యువ వైద్యులు, విద్యార్థులకు సూచించారు.

ప్రముఖులు పాల్గొన్నారు

కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డా. పి. విజయానంద్ రెడ్డి, అడిషనల్ డీఎంఈలు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. కె. చిట్టి నరసమ్మ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డా. ఎం. సత్యనారాయణ రెడ్డి, స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, రేడియేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డా. సి.ఎస్.కె. ప్రకాశ్, AROI AP చాప్టర్ వ్యవస్థాపక కార్యదర్శి డా. బి. రవిశంకర్, అధ్యక్షురాలు డా. ఎన్. సుజాత, కార్యదర్శి డా. పి.బి. ఆనందరావు, కోశాధికారి డా. ఎ. కేశవ రామ్‌గోపాల్, ఉపాధ్యక్షుడు డా. బి. రవిశంకర్, జాయింట్ సెక్రటరీ డా. గీతా ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సదస్సు నిర్వహణలో ఆర్గనైజింగ్ చైర్‌పర్సన్ డా. సి.ఎస్.కె. ప్రకాశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డా. ప్రశాంతి, డా. బి. శ్వేత, ట్రెజరర్లు డా. యు. ఉమామహేశ్వర రెడ్డి, డా. జె. మోహన్ కృష్ణ, డా. కె. సంధ్యారాణి, సైంటిఫిక్ కమిటీ సభ్యులు డా. జి. ఆశాలత, డా. ఎన్. నవీలా మేరీ, హాస్పిటాలిటీ కమిటీ సభ్యులు డా. ఏంజెలిన్ షైనీ ఎఫ్., డా. ఎం. సురేఖ, ఎగ్జిబిషన్ కమిటీ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

AROI AP చాప్టర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డా. వెంకట కృష్ణారెడ్డి పి., డా. ఎ. సతీష్ కుమార్, డా. చాంద్‌ప్రియ వెలూరు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రేడియేషన్ ఆంకాలజిస్టులు, ఫిజీషియన్లు, వైద్య నిపుణులు, పీజీ వైద్య విద్యార్థులు, రెసిడెంట్లు పాల్గొని క్యాన్సర్ చికిత్సలో వస్తున్న ఆధునిక విధానాలు, ముఖ్యంగా గైనకాలజికల్ క్యాన్సర్ నిర్వహణలో తాజా పరిణామాలు, పరిశోధనలు, అనుభవాలను పరస్పరం పంచుకున్నారు. 19, 20 సెప్టెంబర్ రెండు రోజుల పాటు సదస్సు కొనసాగనుంది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL