Pattikonda: పత్తికొండలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ దీక్షలు

Pattikonda: పత్తికొండలో డీఎస్సీ-2025 అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు. మద్దతు తెలిపిన సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 7 Aug 2026 5:13 PM IST
Pattikonda
X

Pattikonda: పత్తికొండలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ దీక్షలు

పత్తికొండ: డీఎస్సీ–2025 నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవినీతిపై సీబీఐతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలో క్రిష్ణగిరి ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, యువకులు పాల్గొని తమ నిరసన తెలిపారు.

నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.వైఎస్సార్‌సీపీ నేతలు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీతో కలిసి ఉద్యమాలు చేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని తెలిపారు.రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు టీడీపీ కార్యాలయాలుగా మారిపోయాయంటూ ఆయన విమర్శించారు.

కేవలం టీడీపీ నేతల కోసమే పోలీసులు పనిచేయడం ప్రజాస్వామ్యానికి, ప్రజా పాలనకు మంచి పరిణామం కాదని అన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని నాయకులు విమర్శించారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగాల భర్తీ చేపట్టి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ–2025 వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హత ఉన్న ప్రతి నిరుద్యోగికి న్యాయం చేయాలని వారు కోరారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీకి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని ప్రకటించారు.

రాష్ట్రంలో సీపీఐ పార్టీ కార్యవర్గంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయని, మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాడేందుకు పార్టీ సిద్ధంగా ఉందని రామచంద్రయ్య తెలిపారు.

విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ రిలే నిరాహారదీక్షలో కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story