Nandyal: చెరువుల పరిరక్షణతో పాటు పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం!
Nandyal: నంద్యాల పెద్ద చెరువు కట్ట వద్ద రూ. 3.50 కోట్లతో చేపట్టే వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ పనులకు మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి శంకుస్థాపన చేశారు.
Nandyal: చెరువుల పరిరక్షణతో పాటు పట్టణాభివృద్ధికి ప్రాధాన్యం!
నంద్యాల: పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీ పెద్ద చెరువు కట్ట వద్ద అమృత్ ట్యాంక్ పథకం కింద రూ.3.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 2.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, సోలార్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ, పెద్ద చెరువు అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం నంద్యాల ప్రజలకు మెరుగైన వాకింగ్, ఆరోగ్య పరిరక్షణ, వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా టౌన్ హాల్ పరిసరాల్లో పార్కుల ఏర్పాటు, పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, డిగ్రీ కళాశాలలు, నేషనల్ కళాశాల వంటి విద్యా, పరిపాలనా మౌలిక వసతులు అభివృద్ధి చెందడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.
ఒకప్పుడు నంద్యాల ప్రాంత ప్రజలు తాగునీటి కోసం కుందూ నది, దూర ప్రాంతాల బావులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అనంతరం కే.సి. కెనాల్ ద్వారా సాగు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందన్నారు. 1999లో నూనెపల్లె, మూలసాగరం తదితర గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో ప్రభుత్వ నిధులు అందుబాటులోకి వచ్చాయని, భూగర్భ జలాల వినియోగం, బోరుబావులు, ఇతర మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, నంద్యాల పట్టణానికి జీవనాధారాలైన చిన్న చెరువు, పెద్ద చెరువులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ, భూగర్భ జలాలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టడంతో పాటు భవిష్యత్ తరాలకు ఈ నీటి వనరులను భద్రంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వాకర్ల కోసం ఆధునిక వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, సోలార్ లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను జిల్లా కేంద్ర నియంత్రణ వ్యవస్థకు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజల నుంచి వచ్చిన తాగునీటి సదుపాయం, ఎన్‌జీఓస్ కాలనీకి అనుసంధానంగా వంతెన నిర్మాణం, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి ప్రతిపాదనలను కూడా పరిశీలించి, బడ్జెట్‌కు అనుగుణంగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ సహకారంతో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని, వేప, ఉసిరి, మారేడు, రావి వంటి ఔషధ, నీడనిచ్చే మొక్కలను అటవీ శాఖ ద్వారా ఉచితంగా అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా వాటి నిర్వహణలో కూడా ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు.
చెరువులు, రోడ్లు, డ్రెయిన్లు వంటి ప్రజా ఆస్తులను ప్రతి ఒక్కరూ తమ సొంత ఆస్తుల్లా భావించి సంరక్షించాలని, నీటి వనరుల్లో చెత్త వేయకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. నంద్యాల పట్టణంలో వెడల్పాటి రహదారులు, డివైడర్లలో మొక్కల పెంపకం, చివరి కాలనీల వరకు రోడ్లు, డ్రెయినేజీ అనుసంధానం, కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. బల్క్ వేస్ట్ జనరేటర్ల వద్ద బయో డైజెస్టర్ల ఏర్పాటు ద్వారా కంపోస్ట్ తయారీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. "స్వచ్ఛ నంద్యాల" సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.




