Nandyal: ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న నంద్యాల యువకుడు!
Nandyal: నంద్యాలకు చెందిన కాంత్ మరియు ఆయన స్నేహితుల బృందం పురాతన కట్టడాల పునరుద్ధరణ చేపట్టి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు. 'పూర్వ సంపద రక్షణ సేన' సేవలు.
Nandyal: ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న నంద్యాల యువకుడు!
Nandyal: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామానికి చెందిన కాంత్, ఆయన బృందం చేపట్టిన పురాతన కట్టడాల పునరుద్ధరణ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ వేదికగా ప్రత్యేకంగా ప్రశంసించారు.
తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన గుహలు, పురాతన ఆలయాలు, కోనేరులను యూట్యూబ్లో వీడియోలు చేస్తూ సందర్శించే సమయంలో, ఆ కట్టడాల దుస్థితిని చూసి చలించిపోయి వాటిని కాపాడాలని కాంత్ సంకల్పించారు.
తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు స్నేహితులతో కలిసి ‘పూర్వ సంపద రక్షణ సేన’ పేరిట ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 35 మంది సభ్యులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
ఏదైనా గ్రామంలో శిథిలావస్థకు చేరిన లేదా పూడిపోయిన పురాతన బావులు, ఆలయాల సమాచారం సేకరించి, గ్రామ పెద్దలతో మాట్లాడి వారి అనుమతి, సహకారంతో శ్రమదానం ద్వారా పనులు మొదలుపెడతారు.
కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో దాదాపు 600 ఏళ్ల చరిత్ర కలిగిన అధ్వానంగా మారిన మెట్ల బావిని ఈ యువ బృందం ఎంతో శ్రమించి శుభ్రం చేసి స్వచ్ఛమైన నీటితో పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది.
కేవలం ఒక బావికే పరిమితం కాకుండా, కొలిమిగుండ్ల మండల పరిధిలోని అల్లాగడ్డ, జమాలుపల్లి తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు దాదాపు 15 బావులు, కోనేరులు, ఆలయాలను ఈ యువ బృందం విజయవంతంగా బాగుచేసింది.




