Markapur: ప్రమాద బీమాతో బాధితుడి కుటుంబానికి అండ!
Markapur: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా రూ.2 లక్షల బీమా చెక్కును బాధితుడికి అందజేత. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలంలో ఘటన, పూర్తి వివరాలు.
Markapur: ప్రమాద బీమాతో బాధితుడి కుటుంబానికి అండ!
Markapur: బేస్తవారిపేట మండలంలో ప్రమాదంలో భార్యను కోల్పోయిన కుటుంబానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా రూ.2 లక్షల బీమా మొత్తం అందింది. కంభం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ బీమా చెక్కును గలిజెరుగుళ్ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ప్రదీప్ కుమార్ రెడ్డి, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్ పంపిణీ చేశారు.
బేస్తవారిపేట మండలం అక్కపల్లె గ్రామానికి చెందిన కొమ్ము సైదయ్య భార్య పెద్ద రంగమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె బ్యాంకు ఖాతాను పరిశీలించిన అధికారులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి, నామినీగా ఉన్న సైదయ్య బ్యాంకు ఖాతాలో రూ.2 లక్షల బీమా మొత్తాన్ని జమ చేశారు.
కంభం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బ్యాంకింగ్ పథకాలు, సామాజిక భద్రతా పథకాలు, డిజిటల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మోసాలు, ప్రైవేటు ఆర్థిక సంస్థల మోసాలు, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్, క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంవత్సరానికి రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల బీమా ప్రయోజనం లభిస్తుందని వివరించారు. రూపే ఏటీఎం కార్డు వినియోగదారులకు కూడా ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు.
బీమా మొత్తం తన పిల్లల చదువుతో పాటు కుటుంబ అభివృద్ధికి వినియోగించుకుంటానని సైదయ్య తెలిపారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించి బీమా ప్రయోజనం పొందేలా చేసిన కంభం ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్, కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్‌లకు సైదయ్య కృతజ్ఞతలు తెలిపారు.




