Nandyala: డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన బస్సు.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

Nandyala: నంద్యాల-కర్నూలు మార్గంలో శాంతిరాం ఆసుపత్రి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పంచరై నిలిచిపోయింది.

R Pavankalyan, Nandyal
Published on: 4 Aug 2026 11:06 PM IST
Nandyala
X

Nandyala: డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన బస్సు.. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

నంద్యాల: నంద్యాల జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. నంద్యాల–కర్నూలు మార్గంలో ప్రయాణికులతో పూర్తిగా నిండిన నంద్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శాంతిరాం ఆస్పత్రి సమీపంలో వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా టైర్ పంచర్ కావడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది.

టైర్ పంచర్ అయినప్పటికీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. కొద్దిసేపు ఆలస్యమైనా లేదా బస్సు అదుపు తప్పి ఉంటే తీవ్ర ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని వారు పేర్కొన్నారు.

టైర్ పంచర్ కారణంగా బస్సు సుమారు అరగంట పాటు రోడ్డుపైనే నిలిచిపోయింది. అయితే బస్సులో ఉన్న స్టెప్నీ టైర్ కూడా పూర్తిగా అరిగిపోయి ఉండటంతో దానిని అమర్చే పరిస్థితి లేకపోయిందని ప్రయాణికులు తెలిపారు. దీంతో బస్సును అక్కడికక్కడే మరమ్మతు చేయడం సాధ్యం కాలేదు. బస్సు ఎక్కువసేపు నిలిచిపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. అనంతరం దారిలో వెళ్తున్న ఇతర ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఆపి తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వాటిలో ఎక్కి ప్రయాణం కొనసాగించారు. దీంతో కొంతసేపు అక్కడ ప్రయాణికుల రద్దీ నెలకొంది.

స్టెప్నీ కూడా పనికిరాని స్థితిలో ఉండగా ఇలాంటి బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఎలా జారీ చేశారు? అంటూ ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను ప్రశ్నించారు. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల తమ సమయం వృథా కావడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్లపైకి పంపే ముందు ప్రతి బస్సును పూర్తిస్థాయిలో తనిఖీ చేసి ఫిట్‌నెస్ నిర్ధారించాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story