kurnool: పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా భరోసా కర్నూలు మున్సిపల్!
kurnool: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని 1,055 మంది పారిశుద్ధ్య కార్మికులకు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్బులు, ఆయిల్‌ల పంపిణీని కమిషనర్ చల్లా ప్రారంభించారు.
kurnool: పారిశుద్ధ్య కార్మికులకు ప్రమాద బీమా భరోసా కర్నూలు మున్సిపల్!
kurnool: నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి నగరపాలక సంస్థ అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. గత రెండేళ్లుగా వ్యక్తిగత పరిశుభ్రత సామగ్రి కోసం పారిశుద్ధ్య కార్మికులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడిందన్నారు. శుక్రవారం సి. క్యాంపులోని 9వ శానిటేషన్ డివిజన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు, ఆయిల్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
* రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సబ్బులు, ఆయిల్‌ల పంపిణీ
* 1,055 మంది కార్మికుల సంక్షేమానికి రూ.72 లక్షల వ్యయం
* ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న వేతన ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు మార్పు
* ప్రమాద బీమా సౌకర్యానికి అర్హత పొందనున్న వేలాది ఉద్యోగులు
* నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమైందని, వారి ఆరోగ్య భద్రత కూడా నగరపాలక సంస్థకు అంతే కీలకమన్నారు. గత రెండేళ్లుగా కార్మికులకు అందాల్సిన సబ్బులు, ఆయిల్, రెయిన్‌కోట్లు, గ్లౌజులు, ఏప్రాన్లు, యూనిఫాంలు, టవల్స్, చెప్పులు, చీరలు పంపిణీ పెండింగ్‌లో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే వాటిని అందించేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇప్పటికే సబ్బులు, ఆయిల్ మినహా మిగిలిన అన్ని సంక్షేమ సామగ్రిని కార్మికులకు పంపిణీ చేశామని, ప్రస్తుతం సబ్బులు, ఆయిల్‌ల పంపిణీతో రెండేళ్ల పెండింగ్‌కు పూర్తిగా తెరపడిందన్నారు. ఇందుకోసం గత రెండేళ్ల కాలానికి సంబంధించిన సబ్బులు, ఆయిల్‌ల కొనుగోలుకు రూ.72 లక్షలు వ్యయం చేసినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యక్తిగత పరిశుభ్రత కిట్లను కూడా త్వరలోనే అందజేయనున్నట్లు వెల్లడించారు.
అదనంగా కార్మికుల పనితీరు మరింత సమర్థవంతంగా ఉండేలా సుమారు రూ.1.50 కోట్లు వ్యయంతో 4 వేల చెత్త బిన్లు, 88 వీల్‌బారోలు, బొంగు రేకులు, సలికలు, పారలు తదితర పారిశుద్ధ్య పనిముట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కమిషనర్ తెలిపారు.
మరోవైపు విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఉద్యోగులు ప్రమాదాలకు గురైన పక్షంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో యాక్సిస్ బ్యాంకు ద్వారా లభించే ప్రమాద బీమా ప్రయోజనాలను వేలాదిమంది రెగ్యులర్, ఆప్కాస్ ఉద్యోగులు పొందేలా, ఏడాదికాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన ఖాతాల మార్పు ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆప్కాస్ ఉద్యోగులతో పాటు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులందరి వేతన ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు మార్చినట్లు పేర్కొన్నారు.
తద్వారా యాక్సిస్ బ్యాంకు ద్వారా వేతనం పొందుతున్న ఉద్యోగి ప్రమాదవశాత్తు మరణించిన పక్షంలో రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి రూ.1 కోటి, ఆప్కాస్ ఉద్యోగి కుటుంబానికి రూ.20 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. సాధారణ మరణం సంభవించిన పక్షంలో రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి రూ.20 లక్షలు, ఆప్కాస్ ఉద్యోగి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందన్నారు.
అదనంగా ఏడాదికి రూ.2,499 ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ప్రమాద బీమా పొందే అవకాశం ఉందని, అలాగే ఏడాదికి రూ.6,000 ప్రీమియం చెల్లిస్తే కుటుంబ సభ్యులందరికీ రూ.3 లక్షల వరకు వైద్య చికిత్స సదుపాయం లభిస్తుందని వివరించారు.కాగా అంతకన్నాముందు కొండారెడ్డి బురుజు ఉద్యానవనం, జిల్లా పరిషత్ కార్యాలయం, మారుతి నగర్, తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ రమేష్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.




