Nandyal: కొడుకుకు భారం కాకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య!

Nandyal: వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యల కారణంగా కొడుకుకు భారం కాకూడదనే ఆవేదనతో వృద్ధ దంపతులు వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

R Pavankalyan, Nandyal
Published on: 14 July 2026 9:36 PM IST
Nandyal
X

Nandyal: కొడుకుకు భారం కాకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య!

నంద్యాల: పట్టణంలోని సంజీవ్ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వృద్ధాప్యంతో బాధపడుతూ కొడుకుకు భారం కాకూడదనే ఆవేదనతో ఓ వృద్ధ దంపతులు ఒకే ఇంటిలో వేర్వేరు గదుల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నంద్యాల సంజీవ్ నగర్‌లోని కోదండరామాలయం వెనుక నివాసం ఉంటున్న పోస్టల్ శాఖ రిటైర్డ్ పోస్టుమెన్ అంకిరెడ్డి (65), ఆయన భార్య అనురాధ (56) మంగళవారం తమ ఇంటిలోని వేర్వేరు గదుల్లో ఫ్యాన్లకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

మృతులకు కిరణ్ కుమార్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దంపతులు.తమ వల్ల కొడుకుకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులకు వెల్లడైంది.

ఆత్మహత్యకు ముందు తమ కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి వాట్సాప్‌కు సందేశం పంపారు. ఆ సందేశాన్ని చూసిన కుమారుడు హుటాహుటిన ఇంటికి చేరుకోగా. తల్లిదండ్రులు ఇద్దరూ ఉరివేసుకుని విగతజీవులుగా కనిపించారు. దీంతో ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న నంద్యాల ఏఎస్పీ సుస్మిత, టూ టౌన్ సీఐ అస్రార్ బాషా, ఎస్సై సురేష్‌తో పాటు పోలీసు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను కిందికి దించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలపై కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపాడు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story