Nandyal: 167 మంది మహిళలకు రూ.30.63 లక్షల రుణాల పంపిణీ!
Nandyal: మహిళల ఆర్థిక స్వావలంబనకు శిల్పా సహకార్ బ్యాంక్ కృషి.. నంద్యాలలో 167 మంది మహిళలకు రూ.30.63 లక్షల రుణాల చెక్కుల పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి.
Nandyal: 167 మంది మహిళలకు రూ.30.63 లక్షల రుణాల పంపిణీ!
Nandyal: మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ముందుకు సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి. ఎన్నికలు, ఓట్ల కోసం కాకుండా గత పదేళ్లుగా నిస్వార్థంగా మహిళల అభివృద్ధికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నంద్యాలలో 167 మంది మహిళలకు రూ.30 లక్షల 63 వేల విలువైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
నంద్యాలలోని శిల్పా సేవాసమితి కార్యాలయ ఆవరణలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 167 మంది మహిళా లబ్ధిదారులకు మొత్తం రూ.30 లక్షల 63 వేల రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ గత పదేళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తోందన్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా మహిళల అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.ప్రజలకు సేవ చేయడమే శిల్పా కుటుంబం లక్ష్యమని నిజాయితీగా ఉంటూ, నిజమే చెబుతూ, ఎలాంటి మోసాలకు పాల్పడకుండా పనిచేస్తామని స్పష్టం చేశారు.
మంచి కార్యక్రమాలు చేపట్టే సంస్థలను అడ్డుకోవడం సరికాదని శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అన్నారు. శిల్పా సేవాసమితి సేవా కార్యక్రమాలను కక్షపూరితంగా అడ్డుకున్నారని ఆరోపించారు. టెక్కె మార్కెట్ యార్డు కాంప్లెక్స్ నుంచి శిల్పా సహకార్ సూపర్ మార్కెట్, రైతు సహకార్, మహిళా బ్యాంక్‌ను ఖాళీ చేయించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ ఏ ఒక్క దుకాణంలోనూ వ్యాపారాలు కొనసాగడం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.
మహిళా బ్యాంక్ ద్వారా రుణాలు పొందిన మహిళలు వాటిని సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న మహిళలకు అవసరమైన శిక్షణ అందించే కార్యక్రమాలను కూడా చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీలతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.




