Srisailam: శ్రీశైలం మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని జర్నలిస్టుల డిమాండ్
Srisailam: శ్రీశైలం క్షేత్రంలో మీడియాపై ఆంక్షలు సరికాదు. అధికారుల పక్షపాత ధోరణిని నిరసిస్తున్న ఏపీడబ్ల్యూజే. ఆంక్షలు ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన.
Srisailam: శ్రీశైలం మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని జర్నలిస్టుల డిమాండ్
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగం,అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APUWJ)జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ రాయల్ అన్నారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ..ప్రోటో కాల్ పేరు మీద వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది,కొందరు దళారులను అరికట్టలేని దేవస్థానం అధికారులు మీడియాపై అడ్డుకట్ట వేయటంపై పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు.
దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీశైల క్షేత్రంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని, అలాంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై విధించటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి,ప్రజలకు వారధిగా ఉంటూ నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న మీడియాపై దేవస్థానం అధికారులు చిన్నచూపు చూడటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు.
మీడియాపై పక్షపాత ధోరణి వ్యవహరిస్తే దేవస్థానం అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దేవస్థానం చైర్మన్,ఈవో స్పందించి మీడియాపై షరతులు విధించటం ఎత్తివేయకపోతే తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.




