Srisailam: వారం రోజుల్లో మగ్గంపై నేత.. అమ్మవారికి 200 గ్రాముల ఇక్కత్ పట్టుచీర
Srisailam: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ అద్భుత సృష్టి చేశారు.
Srisailam: వారం రోజుల్లో మగ్గంపై నేత.. అమ్మవారికి 200 గ్రాముల ఇక్కత్ పట్టుచీర
Srisailam: తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ మంగళవారం అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను శ్రీశైలం అష్టాదశ శక్తిపీఠం కలిగిన భ్రమరాంబ దేవికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడుకి అందజేశారు. కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కోడె కాంతివర్ధిని కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చేనేత కళాకారుడు, విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులతో కలసి వారం రోజుల్లో ఈ పట్టుచీరను మగ్గంపై నేసినట్లుగా తెలియజేశారు. మొత్తం 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు కలిగిన ఈ పట్టుచీర బరువు 200గ్రాముల దాకా వుంటుoదన్నారు.
సంప్రదాయ “ఇక్కత్” నమూనాలో రూపొందించబడిన ఈ చీరను మడత పెట్టినప్పుడు చిన్న అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడిపోతుందన్నారు. శ్రీ అమ్మవారి కృపతోనే ఈ అరుదైన వస్త్రాన్ని రూపొందించడం జరిగిందన్నారు.
దేవస్థానం తరపున ఈ ప్రత్యేక పట్టుచీరను స్వీకరించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు విజయ్ కుమార్ ప్రతిభను అభినoధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంప్రదాయమైన పట్టుచీర మన చేనేత కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మనదేశ సాంస్కృతిక వ్యవస్థలో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు.
మనదేశంలో చేనేత కేవలం వృత్తిమాత్రమే కాదని అది తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప కళ అని అన్నారు. కళాకారుల సృజనాత్మక , నైపుణ్యం మరియు అంకిత భావాలకు చేనేత వస్త్రాలు ప్రతిరూపంగా నిలుస్తాయన్నారు. అందరుకూడా చేనేత వస్త్రాలను ఆదరించాలన్నారు.
ఈ సందర్భంగా వస్త్ర సమర్పణ చేసిన చేనేత కళాకారులు విజయ్ కుమార్ మరియు వారి బృందానికి ప్రత్యేక దర్సనం ఏర్పాట్లు శ్రీశైల దేవస్థానం కల్పించారు.




