Srisailam: దేవాదాయ కమిషనర్‌పై సీఎం చంద్రబాబుకు చైర్మన్ సంచలన లేఖ!
Srisailam: దేవాదాయ శాఖ కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలపై బోర్డు ధ్వజమెత్తం. రెండుసార్లు తిరస్కరించినా టెండర్ల ప్రకటన.
Srisailam: దేవాదాయ కమిషనర్‌పై సీఎం చంద్రబాబుకు చైర్మన్ సంచలన లేఖ!
శ్రీశైలం: భూ మండలానికి నాభి స్థానం .. ఇల కైలాసం .. శ్రీశైల దేవస్థానం మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా కొత్తగా సాలు మంటపాలు నిర్మించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ వ్యక్తిగతంగా ప్రయత్నిస్తున్నారని, అంతేకాకుండా తనపై ఒత్తిడి తెస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం పాలకమండలి చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
రూ. 19 కోట్లతో ప్రధాన రాజ గోపురానికి ఎదురుగా ఇరువైపులా ఉన్న రాతి సాలు మండపాలను తొలగించి కొత్తగా నిర్మించేందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఏకపక్షంగా నిర్మాణ టెండర్లను పిలిచాడని చైర్మన్ లేఖలో వివరించారు. దేవస్థానం ధర్మకర్తల మండలికి ఆమోదం లేకుండా, చర్చించకుండా రెండుసార్లు టెండర్లు ప్రకటించడం ఎవరికి లబ్ధి చేకూరుతుందో తమకు అర్థం కావడం లేదు అన్నారు. ఇప్పటికే రెండు మార్లు టెండర్ల ప్రక్రియ ధర్మకర్తల మండలి తిరస్కరించిందని, భక్తులు సమర్పించిన విరాళాలలో రూ. 19 కోట్ల నిధులు వృధా చేయడాన్ని పాలక మండలి వ్యతిరేకించి ఆమోదించలేమని స్పష్టంగా తెలిపారు.
తాము తిరస్కరించడానికి కారణాలను కూడా చైర్మన్ వివరిస్తూ .. శ్రీశైల దేవస్థానం మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఇప్పటివరకు శౌచాలయాలు పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులో లేవని, భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు కమ్యూనిటీ కాంప్లెక్స్‌లు సరిపోవడంలేదని, వేల సంఖ్యలో వచ్చే భక్తులకు దర్శనం క్యూ కాంప్లెక్స్ ల్లో తొక్కిసలాట సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అని పేర్కొన్నారు.
మొదటి ప్రాధాన్యత క్రమంలో పై సమస్యలన్నీ పరిష్కరించి ఆ తర్వాత చాలు మండపాల నిర్మాణం అంశం చర్చిస్తే బాగుంటుందని చైర్మన్ అభిప్రాయపడ్డారు. దేవాదాయ శాఖ కమిషనర్ తనపై తీవ్ర ఒత్తిడి తెస్తూ నూతన సాలు మండపాల నిర్మాణ టెండర్లకు ఆమోదం తెలపాలంటూ ఆదేశిస్తున్నారని ముఖ్యమంత్రికి చైర్మన్ ఫిర్యాదు చేశారు.
సామాన్య శకం 14 - 15 శతాబ్దాలలో శ్రీకృష్ణదేవరాయలు భక్తులు సేద తీరడానికి నిర్మించారని .. ఈ చారిత్రాత్మక సాలు మండపాలను తొలగిస్తే చరిత్ర కనుమరుగవుతుందని సమస్యపై సమగ్ర విచారణ జరిపి రూ. 19 కోట్లు వృధా కాకుండా ప్రస్తుతం భక్తులకు అవసరమైన సౌకర్యాల కోసం వినియోగించేలా చూడాలని శ్రీశైలం దేవస్థానం పాలకమండలి చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు లేఖ రాశారు.
ఇదిలా ఉంటే కొంతకాలంగా శ్రీశైల దేవస్థానం నిర్వహణ విభాగాల అధిపతుల నిర్ణయాలవల్ల దేవస్థానం రాబడి అనవసర ఖర్చులకు వి వెచ్చిస్తున్నారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. దేవస్థాన నిర్వహణ విభాగాలకు, పాలకమండలి మధ్య బేధాభిప్రాయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని దీనికి తోడు దేవస్థానంపై అధికార పార్టీ నేతల, అనుచరుల పెత్తనంతో శ్రీశైల దేవస్థానం ప్రతిష్ట మసకబారుతుందని భక్తులు బహిరంగగా విమర్శిస్తున్నారు . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి సమస్యాత్మక విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని మల్లన్న భక్తులు కోరుతున్నారు.




