Srisailam: సాలుమండపాల నిర్మాణం.. టెండర్లపై ఈవో క్లారిటీ!
Srisailam: సాలుమండపాల నిర్మాణం, టెండర్ల ప్రక్రియపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) ఎం. శ్రీనివాసరావు అధికారిక వివరణ ఇచ్చారు.
Srisailam: సాలుమండపాల నిర్మాణం.. టెండర్లపై ఈవో క్లారిటీ!
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో సాలుమండపాల నిర్మాణము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా శ్రీశైల అభివృద్ధి డ్రాఫ్టు మాస్టరుప్లానులో "శివంమార్గం" (శివం-మార్గ్) పేరుతో పొందుపరచడమైనది శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు అన్నారు.
సదరు నిర్మాణం రాతికట్టడంతో కూడుకున్నది అయినందున మరియు టెండరు ప్రక్రియ పూర్తి అగుటకు సమయం పట్టే కారణంగాను, సదరు ప్రక్రియకు సంబంధించిన అన్ని విషయాలు నిబంధనల ప్రకారం రాబోవు సమావేశంలో ధర్మకర్తల మండలి ఆమోదమునకు లోబడే ముందస్తుగా టెండరు ప్రకటన జారీ చేశామన్నారు . అలాగే సమావేశములో ధర్మకర్తల మండలి పూర్తి స్వతంత్రముతో తీర్మానము ద్వారా తగు నిర్ణయము తీసుకొనవచ్చునని ఈవో తెలిపారు.
అయితే నిబంధనల ప్రకారము అట్టి నిర్ణయము ధర్మకర్తల మండలి సమావేశములోనే తీసుకొనవలయును. ఈ విషయములో ఏ ఒక్క సభ్యుడు కానీ చైర్మెన్ కానీ తమ వ్యక్తిగత అభిప్రాయమును ప్రకటించుట సమంజసము కాదన్నారు. ఇందులో ఎవరి నుండి ఏవిధమైన ఒత్తిడికి అవకాశము మరియు ఎవరికినీ ఏవిధమైన ఉద్దేశ్యము లేదని స్పష్టంగా తెలియజేయాలన్నారు .
అదేవిధంగా ఈ నెల 28న జరగబోవు ధర్మకర్తల మండలి సమావేశం నందు సదరు టెండరు వివరములను చర్చకు ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగిందన్నారు. సదరు సమావేశం నందు ధర్మకర్తల మండలి వారు చేయు తీర్మానమును అనుసరించే సాలుమండప నిర్మాణం విషయమై తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.
కాగా భక్తులకు మౌలికసదుపాయాల కల్పన, క్యూకాంప్లెక్సు నిర్మాణం వంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. ఆయా పనుల విషయములో త్వరితగతిన చర్యలు గైకొనబడుచున్నాయి. ఈ మౌలికసదుపాయాలకు సంబంధించిన నిర్మాణాలన్నీ మాస్టర్ ప్లాన్ లో కూడా పొందుపరచడం జరిగిందిని శ్రీశైల దేవస్థానం కార్య నిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు.




