Srisailam: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కీలక అభివృద్ధి పనులకు ఆమోదం
Srisailam: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశంలో 15 అజెండాలకు ఆమోదం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్యూ కాంప్లెక్స్, రోడ్లు, డార్మెంటరీల నిర్మాణానికి నిర్ణయం.
Srisailam
Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో ఆరవ ట్రస్ట్ బోర్డు సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలన భవనంలో జరిగిన ఈ సమావేశంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అనివార్య కారణాల వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమావేశంలో మొత్తం 22 అజెండా అంశాలను పరిశీలించగా, 15 అంశాలకు ఆమోదం తెలపగా, 5 అంశాలను వాయిదా వేశారు. మరో 2 అంశాలను తిరస్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ రమేష్ నాయుడు మాట్లాడుతూ, శ్రీశైలం క్షేత్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం ఉన్న డార్మెంటరీలను ఆధునికీకరించడంతో పాటు కొత్త డార్మెంటరీల నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు.
ఇతర అభివృద్ధి కార్యక్రమాలుగా శ్రీశైలం టోల్ గేట్ నుంచి కుమారసదనం వరకు రూ.24 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, దేవస్థానం వర్క్‌షాప్ నుంచి పాతాళగంగ పాత మెట్ల వరకు రూ.36.50 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ బైపాస్ పనులకు ఆమోదం తెలిపారు.
క్షేత్ర పరిధిలో 20 ప్రదేశాల్లో శాశ్వత శౌచాలయాల నిర్మాణం, సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో ఎస్బిఐ బ్యాంక్ శాఖ ఏర్పాటు, దేవస్థానం గోశాలలో గోవులకు గడ్డి సరఫరా వంటి అంశాలకు కూడా ఆమోదం లభించింది. అదనంగా, శ్రీశైలంలో సుమారు 6 వేల మొక్కలు నాటాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది.




