Yemmiganur: బాబా ఫరీద్ జయంతి వేళ మెగా రక్తదానం
Yemmiganur: ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డిలో సయ్యద్ బాబా ఫరీద్ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Yemmiganur: బాబా ఫరీద్ జయంతి వేళ మెగా రక్తదానం
Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోలోని సిరాలదొడ్డి సబ్ స్టేషన్ వద్ద వెలసిన సయ్యద్ బాబా ఫరీద్ స్వాముల వారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దర్గా పీఠాధిపతులు సయ్యద్ నూర్ బాబా సాహెబ్, సయ్యద్ ఖాదర్ బాబా సాహెబ్, సర్ఫరాజ్ బాబా సాహెబ్ ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామి వారి జయంతిని పురస్కరించుకుని కె.ఎస్.ఎస్.బీ ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దర్గా ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిబిరానికి యువత నుంచి విశేష స్పందన లభించింది. పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని పీఠాధిపతులు, సొసైటీ సభ్యులు అభినందించారు. అనంతరం దర్గా పీఠాధిపతులు, సొసైటీ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి సయ్యద్ నూర్ బాబా సాహెబ్ మాట్లాడుతూ.. సయ్యద్ బాబా ఫరీద్ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. బాబా ఫరీద్ స్వామి బోధనలు, ఆయన చూపిన సేవా మార్గం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. కులమతాలకు అతీతంగా మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కె.ఎస్.ఎస్.బీ ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, కె.ఎస్.ఎస్.బీ ఫరీద్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




