Kurnool: కర్నూలు ఆసుపత్రిని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలబెడతాం.. టీజీ భరత్

Kurnool: కర్నూలు సర్వజన ఆసుపత్రిలో రోగుల సహాయకుల కోసం రూ. 14.67 కోట్లతో నిర్మించనున్న 'విశ్రాం సదన్' భవనానికి మంత్రి టీజీ భరత్ గుప్తా భూమి పూజ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 23 May 2026 6:42 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు ఆసుపత్రిని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలబెడతాం.. టీజీ భరత్

Kurnool: కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నామని విశ్రాం సదన్ భూమి పూజ సందర్భంగా పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి భరత్ గుప్తా పేర్కొన్నారు.

కర్నూలు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల సహాయకుల నివాసం నిమిత్తం 14.67 కోట్ల రూపాయలతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి నిధుల ద్వారా నిర్మించతలపెట్టిన భవన భూమి పూజ కార్యక్రమం లో మంత్రి టి జి భరత్ గుప్త ,పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజంగ్ డైరెక్టర్ వంశీ రామ మోహన్ బుర్రా , పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత మరియు అధికారులు పాల్గొన్నారు.

భూమి పూజ , శిలాఫలకం ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి భరత్ గుప్త మాట్లాడుతూ.. కర్నూలు సర్వజన ఆసుపత్రి అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నామని , కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించి మూడవ స్థానంలో ఉన్న ఆసుపత్రిని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్న సంకల్పం తో కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఇపుడు అన్ని సౌకర్యాలతో విశ్రాం సదన్ నిర్మాణానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారిని ఒప్పించడం జరిగిందని తెలిపారు.

అన్ని విధాల అనుమతులు ఉన్నందున భవన నిర్మాణం పది నెలలలో పూర్తి చేసే విధంగా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వారిని మంత్రి కోరారు. ఈ ఆసుపత్రిలో నిష్టాతులైన వైద్యులు మరియు మంచి సౌకర్యాలు ఉండడం వలన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలే కాకుండా తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో వైద్యం కొరకు వస్తారని వారికి ఈ భవనం చాలా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి వలన క్యాన్సర్ ఆసుపత్రి చక్కగా పనిచేయడం వలన ప్రస్తుతం ఉండవలసిన 160 రోగుల కంటే ఎక్కువ మంది వైద్యం పొందుతున్నారు అని తెలిపారు. కావున పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారు ఇంకా ఎక్కువ నిధులు సమకూర్చి ఆసుపత్రికి కావలసిన సదుపాయాలు కల్పించవలసిందిగా కోరుతూ సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ భవన పరిసరాలు కూడా ఎల్లపుడు పరిశుభ్రంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని, ఇక్కడికి వచ్చి ఉండే వారిని కూడా బాధ్యతగా వ్యవహరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లను ఆదేశించారు.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజంగ్ డైరెక్టర్ వంశీ రామ మోహన్ బుర్రా మాట్లాడుతూ.. మా సంస్థ ఇప్పటివరకు దాదాపు 100 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ సోషియాల్ రెస్పాన్స్ బిలిటీ క్రింద వివిధ అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగిందని, కర్నూలులో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిటీ స్కాన్ కొరకు నిధులు కేటాయించామని ఇప్పుడు విశ్రాం సదన్ కొరకు రూ 14.67 కోట్ల నిధులు వెచ్చిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడుతున్నామని ఇంకా అవకాశం ఉంటే సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నేను గతం లో జి.పుల్లారెడ్డి విద్యాసంస్థల పూర్వపు విద్యార్థిని అని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి మా సంస్థ ద్వారా నా వంతు సహాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ భవన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సభను ఉద్దేశించి పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత మాట్లాడుతూ... ఈ భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి రాష్ట్రంలోని ఏడు జిల్లాలు , తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలకు ఉపయోగపడే చర్యలు తీసుకోవాలని , గతంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా 6 కోట్ల 50 లక్షలు రూపాయలతో సిటీ స్కాన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. భవన నిర్మాణం తర్వాత పారిశుద్ధ్యంలో ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... 1956 లో కట్టిన ఈ ఆసుపత్రి అంచలంచలుగా ప్రజాసేవలో ముందుండి మంచి పేరు సాధించిందని , ప్రతి రోజు 20 శాతం తెలంగాణ రాష్ట్రం నుండి, కర్ణాటక నుండి కూడా ప్రజలు వైద్యం కొరకు వస్తారని వారు వైద్యం కు వచ్చినప్పుడు ఉండటానికి సౌకర్యాలు లేవని తెలిపారు. కావున ఈ భవన నిర్మాణానికి 60 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగిందని దాని వలన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారు హోటల్ లాంటి భవన నిర్మాణానికి ముందుకు రావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రి మంచి సేవలు అందించడంలో రాష్ట్రంలో మూడవ స్థానంలో కి వచ్చింది అని ఈ స్థాయికి రావడానికి మంత్రి టీజీ భరత్ కృషి చాలా ఉన్నదని , రాష్ట్రంలో మొదటి స్థానానికి చేరుకోవడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

సమావేశం అనంతరం మంత్రి చేతులు మీదుగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ సిబ్బంది కి సన్మానం చేశారు. స్నేహ శ్రీ వెల్ఫేర్ సొసైటీ వారి సౌజన్యంతో 6 లక్షల 35 వేల రూపాయల విలువ చేసే బ్యాటరీ తో నడిచే స్ట్రక్చర్ వాహనాన్ని క్యాన్సర్ ఆసుపత్రి రోగులకు అవసరమైన సేవల నిమిత్తం మంత్రి , ఎమ్మెల్యే , పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారుల చేతుల మీదుగా ప్రారంభించి క్యాన్సర్ ఆసుపత్రి అధికారులకు అందించడం జరిగింది.

ఈ భూమి పూజ కార్యక్రమానికి జి జి హెచ్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దోమన్ యాదవ్, చీఫ్ జిఎం సంజీవ్ కుమార్ సింగ్, సిఎస్ఆర్ హెడ్ అఖిలేష్ పాఠక్, జి పి పయశీ, ప్రవీణ్ కుమార్, అరుణ్ కుమార్, బి బి రత్, వెంకట్, టి ఎస్ సి రావు, సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, బైసాని పద్మజ , సాయి ప్రదీప్, సోమిశెట్టి శ్రీకాంత్, డిసిహెచ్ఎస్ జఫ్ఫ్రూలా, ఏపీ ఎమ్మెఐడిసి ఎస్ఈ ఇంద్ర మొదలగువారు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story