Nandyal: నంద్యాలలో ‘ఎస్‌ఐఆర్’ రచ్చ.. రూల్స్ బ్రేక్ చేసి టీడీపీ ఆఫీసుల్లో సర్వే!
Nandyal: నంద్యాలలో ఓటర్ల జాబితా పరిశీలన (ఎస్‌ఐఆర్ ప్రక్రియ) అస్తవ్యస్తంగా మారింది.
Nandyal: నంద్యాలలో ‘ఎస్‌ఐఆర్’ రచ్చ.. రూల్స్ బ్రేక్ చేసి టీడీపీ ఆఫీసుల్లో సర్వే!
నంద్యాల: ఎస్‌ఐఆర్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితాను పరిశీలించాల్సిన అధికారులు… సచివాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాల్లోనే సర్వే నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాలలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బి.ఎల్.ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాల్సి ఉంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో సచివాలయాలకు చేరుకుని అధికారుల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇంటింటికి వచ్చి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా… తమనెందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నంద్యాల 17వ వార్డులో పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారింది. సచివాలయ ఉద్యోగులు ఏకంగా తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి… అక్కడే ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.అలాగే పట్టణంలోని 6వ వార్డు సచివాలయంలో… ఒక టిడిపి నాయకుడి బంధువు ఓటర్ల జాబితాలను పరిశీలిస్తూ కనిపించడం మరో వివాదానికి దారితీసింది..
ఇక 10వ వార్డు, 37వ వార్డు సచివాలయాల్లో బి.ఎల్.ఓలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు గంటలకొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.“బి.ఎల్.ఓలు ఇంటింటికి ఎందుకు రావడం లేదు? నిబంధనలు ఎందుకు పాటించడం లేదు?” అంటూ వార్డు ప్రజలు, వైసిపి కార్యకర్తలు అధికారులను నిలదీశారు.
మొత్తానికి… నంద్యాలలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




