Kurnool: ఎమ్మిగనూరులో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం!

Kurnool: ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఎమ్మిగనూరు రేఖా నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో కీళ్లు, కండరాల నొప్పుల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది.

S Khaleel, Yemmiganur
Published on: 8 Sept 2026 11:48 PM IST
Kurnool
X

Kurnool: ఎమ్మిగనూరులో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం!

కర్నూలు: ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని రేఖా నర్సింగ్ హోమ్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ కార్తీక్ ఫిజియోథెరపీ ప్రాముఖ్యత, దాని ద్వారా కలిగే ప్రయోజనాలపై రోగులకు మరియు సిబ్బందికి అవగాహన కల్పించారు.

శస్త్రచికిత్సలు అవసరం లేని కొన్ని కండరాలు, కీళ్ల సమస్యల్లోనూ, అలాగే శస్త్రచికిత్స అనంతరం రోగులు త్వరగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవడంలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ కార్తీక్ తెలిపారు. ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, కీళ్ల సమస్యలు అధికమవుతున్నాయని పేర్కొన్నారు.

సరైన ఫిజియోథెరపీ వ్యాయామాలను నిపుణుల సూచనల మేరకు క్రమం తప్పకుండా చేయడం ద్వారా నొప్పులను నియంత్రించడంతో పాటు శరీర కదలికలు, కండరాల బలాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. దీర్ఘకాలికంగా ఎముకలు, కండరాల బలహీనత రాకుండా ఉండేందుకు ప్రతిరోజూ తగినంత శారీరక కదలిక, సమతుల్య ఆహారం, నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చేయడం అవసరమన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆధునిక రిహాబిలిటేషన్, ఫిజియోథెరపీ సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని డాక్టర్ కార్తీక్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రేఖా నర్సింగ్ హోమ్ వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story