Banaganapalle: నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలకు ఏర్పాట్లు!

Banaganapalle: నంద్యాల జిల్లా యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. నవంబర్ 24న వైభవంగా కార్తీక లక్ష దీపోత్సవం.

Ramanaiah, Banaganepalle
Published on: 8 Nov 2026 8:17 AM IST
Banaganapalle
X

Banaganapalle: నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలకు ఏర్పాట్లు!

Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని సుందరమైన ఎర్రమల కొండల నడుమ వెలసిన దక్షిణ కాశీ, ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసోత్సవాలకు ముస్తాబైంది. హరిహర బుక్కరాయల కాలం నాటి చారిత్రక వైభవం, నిరంతరం పరిమాణం పెరిగే స్వయంభూ నంది అద్భుతాలు నెలకొన్న ఈ పుణ్యధామం ఈ నెల 10 నుంచి డిసెంబర్ 8 వరకు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లనుంది.

నవంబర్ 24న కనులవిందుగా లక్ష దీపోత్సవం

కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన కార్తీక సోమవారాలు (నవంబరు 16, 23, 30, డిసెంబర్ 7) క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా నవంబరు 24న వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయ ప్రాంగణంలో "కార్తీక లక్ష దీపోత్సవం" కనులవిందుగా సాగనుంది. కోనేరు పరిసరాలు, ఆలయ ప్రాకారాలు వేలాది ప్రమిదల కాంతులతో వెలిగిపోనున్నాయి.

భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక వసతులు: ఆలయ ఈవో, చైర్మన్

రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సర్వసన్నద్ధమయ్యారు. ఏర్పాట్లపై ఆలయ ఈవో పాండురంగా రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ బండి మౌళిశ్వరరెడ్డి మాట్లాడుతూ:

క్యూలైన్లు తాగునీరు రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ బారికేడ్లు, నిరంతర శుద్ధ జల సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

మహా ప్రసాద వితరణ ప్రత్యేక సోమవారాలు, పర్వదినాల్లో అన్నదాతల సహకారంతో భక్తులందరికీ నిరంతర అన్నదానం, ప్రసాద వితరణ ఉంటుంది

విద్యుద్దీపాలంకరణ

ఆలయ గోపురాలు, ప్రాకారాలు, కొండ పరిసరాలు ఆకర్షణీయమైన రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు.

ఉమామహేశ్వర స్వామివారి దర్శనానికి తరలివచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకుని, తృప్తితో తిరిగి వెళ్లేలా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

క్షేత్ర విశిష్టత

అగస్త్య మహర్షి తపస్సుతో పావనమైన యాగంటి క్షేత్రంలో పరమశివుడు లింగరూపంలో కాకుండా శ్రీ ఉమామహేశ్వరుడిగా విగ్రహరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాకుండా యుగాంతం నాటికి రంకె వేస్తుందని భావించే నంది విగ్రహం జీవకళతో పరిమాణం పెరుగుతుండటం దేశవ్యాప్తంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle