Nandyal: ఘరానా మోసం.. స్నేహాన్ని ఆసరాగా చేసుకుని బంగారం, నగదు లూటీ!

Nandyal: బాల్య స్నేహం పేరుతో నమ్మించి రూ.50 లక్షల నగదు, 20 తులాల బంగారం కాజేసిన అనంతపురం జిల్లా వైసీపీ నేత వైభవ్‌పై నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

R Pavankalyan, Nandyal
Published on: 18 July 2026 5:27 PM IST
Nandyal
X

Nandyal: ఘరానా మోసం.. స్నేహాన్ని ఆసరాగా చేసుకుని బంగారం, నగదు లూటీ!

నంద్యాల: అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత వైభవ్‌పై సంచలన మోసం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాల్య స్నేహితురాలిని నమ్మించి రూ.50 లక్షలకుపైగా నగదు, బంగారం, వెండిని కాజేశాడని బాధితురాలు నాగశ్వేత ఆరోపిస్తోంది. కేసు నమోదై రెండు నెలలు గడిచినా నిందితుడిని అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాల్య స్నేహాన్ని ఆసరాగా చేసుకుని నంద్యాలకు చెందిన నాగశ్వేతను ట్రాప్‌లో పడేసి రూ.50 లక్షలకుపైగా నగదు, బంగారం, వెండిని కాజేశాడని అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత వైభవ్‌పై ఆరోపణలు వచ్చాయి.

నాగశ్వేతకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగి మంజునాథ్‌తో వివాహం కాగా, వివాహానంతరం ఆమె నంద్యాలలో స్థిరపడింది. రెండేళ్ల క్రితం బాల్య స్నేహాన్ని గుర్తు చేస్తూ వైభవ్ మళ్లీ పరిచయం పెంచుకుని ఆమె నమ్మకాన్ని సంపాదించాడని బాధితురాలు తెలిపింది.

భర్తకు తెలియకుండా మొదట రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్న వైభవ్, అనంతరం శ్రీశైలంలో ప్లేట్ల సరఫరా టెండర్ ఉందని చెప్పి మరో రూ.5 లక్షలు తీసుకున్నాడని నాగశ్వేత ఆరోపించింది.

అంతటితో ఆగకుండా "శ్వేత ఎంటర్‌ప్రైజెస్" పేరుతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని నమ్మించి, నంద్యాల ఎస్‌బీఐ బ్రాంచ్‌లో నాగశ్వేత పేరుతో రూ.11 లక్షల రుణం తీసుకుని ఆ మొత్తాన్ని కూడా కాజేశాడని ఆమె పేర్కొంది.

ఇక నాగశ్వేత మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా కూడా రుణాలు తీసుకున్నాడని, వాటి ద్వారా వచ్చిన డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించింది.

వైభవ్ మాటలు నమ్మిన తాను భర్తకు తెలియకుండా 20 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండిని కూడా ఇచ్చేశానని నాగశ్వేత వాపోయింది.

ఈ డబ్బుతో వైభవ్ విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించిన నాగశ్వేత... రుణాల వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు తన ఇంటికి నోటీసులు పంపించారని తెలిపింది. ఆ నోటీసులు చూసి తన కుటుంబ సభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారని చెప్పింది.

తన ఫిర్యాదు మేరకు నంద్యాల టూ టౌన్ పోలీసులు వైభవ్‌పై కేసు నమోదు చేసినప్పటికీ, రెండు నెలలు గడిచినా ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని నాగశ్వేత ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.

బాల్య స్నేహాన్ని నమ్మిన మహిళకు భారీ ఆర్థిక నష్టం జరిగిందనే ఈ ఘటన ఇప్పుడు నంద్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదైనప్పటికీ నిందితుడి అరెస్ట్ ఆలస్యం కావడంపై బాధితురాలు న్యాయం కోరుతోంది. పోలీసులు ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story