Nandyal: నందికొట్కూరులో పర్సెంటేజీల రాజ్యం.. సుదీర్ దారా షాకింగ్ ఆరోపణలు!
Nandyal: నందికొట్కూరు మున్సిపాలిటీలో అవినీతిపై డాక్టర్ సుదీర్ దారా ఫైర్. షాదీఖానా ప్రారంభించకపోవడంపై మండిపాటు.
Nandyal: నందికొట్కూరులో పర్సెంటేజీల రాజ్యం.. సుదీర్ దారా షాకింగ్ ఆరోపణలు!
నంద్యాల జిల్లా: నందికొట్కూరులో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో నందికొట్కూరు మున్సిపాలిటీలో అభివృద్ధి శూన్యమని, అవినీతి రాజ్యమేలుతోందని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డా.సుదీర్ దారా ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీ నేతలు అభివృద్ధిని పక్కనపెట్టి పర్సెంటేజీల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో ఇద్దరు నేతలను పెట్టి సాయంత్రానికి కమిషనర్ వద్ద కమిషన్ వసూలు చేసి పార్టీ పెద్దలకు అప్పజెప్తున్నారని ఆరోపించారు. పర్సెంటేజ్ ఇవ్వడం లేదని మున్సిపాలిటీలోని ఒక గదికి తాళం వేసి మరీ వసూలు చేస్తున్నారని తెలిపారు.
వైఎస్ఆర్సీపీ హయాంలో మున్సిపాలిటీలో రూ.59 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, టీడీపీ ఎమ్మెల్యే ఏం చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేజీ రోడ్డుపై మంజూరైన డివైడర్ పనులను పర్సెంటేజీల కోసం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల కోసం పూర్తిచేసిన షాదిఖానాను టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. ఒక్క పెళ్లి కాదు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటున్న పవన్ కళ్యాణ్, మాకు ఒక్క పెళ్లి చేసుకోవడానికి షాదిఖానను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ వల్ల కుమ్మరిపేట, బైరెడ్డి నగర్, వాల్మీకి నగర్, వడ్డేపేట కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలుష్యంతో రోగాలు వ్యాపించే అవకాశం ఉందని, తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ వెంకటరామిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏబీఎం పాలెం దళిత కాలనీలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, దళితుల పట్ల చిన్నచూపు తగదని అన్నారు. ఒక ఇంటి ఎంపీ వర్గం కుళాయి కావాలంటే ఎమ్మెల్యే వర్గం అరుగు కట్టి కుళాయి లేకుండా చేశారని ఆరోపించారు. నందికొట్కూరు మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు వెళ్లి ప్రజల పక్షాన పోరాడతానని, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని డా.సుదీర్ దారా తెలిపారు.




