Kurnool: ఇంధన ధరల పెంపుపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్!
Kurnool: పెట్రోల్, ధరలను అమాంతం పెంచుతూ సామాన్య ప్రజలను సంక్షోభంలోకి నెడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు.
Kurnool: ఇంధన ధరల పెంపుపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఫైర్!
Kurnool: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచుతూ సామాన్య ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెడుతున్నాయని బనగానపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని దీనివల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచడం ప్రజలపై ఆర్థిక భారం మోపడమేనన్నారు. మే 15న పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున పెంచగా, మే 19న పెట్రోల్‌పై 95 పైసలు, డీజిల్‌పై 97 పైసలు, మే 23న పెట్రోల్‌పై 97 పైసలు, డీజిల్‌పై 99 పైసలు, మే 25న తాజాగా పెట్రోల్‌పై రూ.2.87, డీజిల్‌పై రూ.2.85 పెంచారని వివరించారు. మొత్తంగా పది రోజుల్లోనే పెట్రోల్ ధర లీటరుకు రూ.7.79, డీజిల్ ధర రూ.7.81 పెరిగిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోనే దేశంలో అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.10 వరకు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తూ ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంధన ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న పన్నులను వెంటనే తగ్గించాలని కాటసాని రామిరెడ్డి డిమాండ్ చేశారు
ఎన్నికల ముందు చమురు కొరత ఉండదు ధరలు పెరగవు అంటూ హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు, నేడు వరుసగా ధరలు పెంచుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ధరలు తగ్గించాలని ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టి, ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోక, వరుసగా ధరలను పెంచుకుంటూనే పోతున్నారన్నారు. ప్రజల ఆవేదనను ప్రభుత్వం వెంటనే గుర్తించి ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాటసాని రామిరెడ్డి హెచ్చరించారు.




