వాయు కాలుష్యంతో చర్మ సమస్యలు కూడా తప్పువు.. హెచ్చరిస్తున్న నిపుణులు
Air Pollution: ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలే కాకుండా చర్మంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Air Pollution: ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలే కాకుండా చర్మంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ కలుషిత గాలిని పీల్చడం, దాని మధ్య ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మం త్వరగా వృద్ధాప్య ఛాయలను సంతరించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాలుష్యంతో చర్మానికి ఎదురయ్యే సమస్యలు ఇవే
గాలిలో ఉండే పీఎం 2.5, పీఎం 10 వంటి అతి సూక్ష్మ ధూళి కణాలు చర్మంపై పేరుకుపోతాయి. వీటితో పాటు గాలిలో ఉండే వివిధ రకాల రసాయనాలు, హానికర పదార్థాలు చర్మానికి సహజంగా ఉండే రక్షణ పొరను దెబ్బతీస్తాయి. ఫలితంగా చర్మం తేమను నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది. దీంతో చర్మం పొడిబారడం, మంట, దురద, చికాకు వంటి సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఈ ఇబ్బందులు మరింత ఎక్కువగా కనిపించవచ్చు.
ముఖంపై ముందుగానే ముడతలు వచ్చే ప్రమాదం
కాలుష్యం ప్రభావం చర్మం పైపొరతోనే ఆగిపోదు. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. దీనివల్ల ఫ్రీ రాడికల్స్ ఎక్కువై చర్మ కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే చర్మానికి బిగుతు, మృదుత్వం అందించే కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రోటీన్లపై కూడా ప్రభావం పడుతుంది. ఇవి దెబ్బతినడం వల్ల ముఖంపై సన్నని గీతలు, ముడతలు ముందుగానే కనిపిస్తాయి. ఫలితంగా వయసు పెరగకముందే ముఖం ముసలితనపు ఛాయలను సంతరించుకోవచ్చు. అయితే ఈ ప్రభావం ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
చర్మం రంగు మారడం, మొటిమలు వచ్చే అవకాశం
కలుషిత గాలికి ఎక్కువగా గురయ్యేవారిలో చర్మం క్రమంగా కళ కోల్పోతుంది. ముఖం నిర్జీవంగా కనిపించడం, చర్మం పొడిబారడం, రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో నల్లటి మచ్చలు, ఛాయలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాలుష్యం వల్ల చర్మ రక్షణ పొర బలహీనపడటంతో ఇప్పటికే చర్మ సమస్యలు ఉన్నవారిలో అవి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఇలా చేయండి
కలుషిత వాతావరణంలో ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత మైల్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి తొలగిపోతాయి. చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్‌ను ప్రతిరోజూ ఉపయోగించాలి. ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
బయటకు వెళ్లేటప్పుడు ఎస్పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే జామ, నారింజ వంటి పండ్లతో పాటు ఆకుకూరలు, ఇతర కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. కాలుష్యం నుంచి చర్మాన్ని పూర్తిగా కాపాడుకోవడం సాధ్యం కాకపోయినా, సరైన శుభ్రత, తగినంత తేమ, ఆరోగ్యకరమైన ఆహారంతో దాని ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.




