Health Issues: ఎంత తిన్నా వెంటనే మళ్లీ ఆకలవుతోందా?.. అయితే ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే
Health Issues: ఉదయం అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపించడం కొందరికి సాధారణం అనిపిస్తుంది.
Always Hungry
Health Issues: ఆకలి వేయడం అనేది శరీరంలో జరిగే సహజమైన ప్రక్రియ. ఉదయం అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపించడం కొందరికి సాధారణం అనిపిస్తుంది. కానీ తిన్న వెంటనే కడుపు ఖాళీ అయినట్లు అనిపించడం, రోజంతా విపరీతంగా ఆకలి వేయడాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల ప్రకారం ఇలా తరచూ ఆకలి వేయడానికి మన శరీరంలో అంతర్గతంగా తలెత్తే కొన్ని ఆరోగ్య సమస్యలే ప్రధాన కారణం కావచ్చని వెల్లడించారు. పిల్లల్లో జీవక్రియ వేగంగా ఉంటుంది కాబట్టి వారు త్వరగా అలిసిపోయి తింటారు, కానీ వయసు పెరుగుతున్న కొద్దీ నిత్యం ఆకలి వేయడం ఆందోళన కలిగించే విషయమే.
డయాబెటిస్, లో బ్లడ్ షుగర్ ప్రభావం
వైద్యపరంగా విపరీతమైన ఆకలి వేసే సమస్యను పాలిఫాగియా అని పిలుస్తారు. శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో తరచూ ఆకలి వేయడం సర్వసాధారణం. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయినప్పుడు విపరీతమైన ఆకలితో పాటు చెమటలు పట్టడం, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసినప్పుడు శరీరం కేలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది, దీనివల్ల కూడా ఆకలి విపరీతంగా పెరుగుతుంది.
ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు
శరీరంలో తలెత్తే మానసిక ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరిగి, తిండిపై కోరికలను ఎక్కువగా కలిగిస్తాయి. అలాగే రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే ఆకలిని నియంత్రించే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల నిత్యం కడుపులో ఏదో తిందామనే భావన కలుగుతుంది. మహిళల్లో రుతుక్రమానికి ముందు వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఆకలి పెరుగుతుంది. ఇక డిప్రెషన్ లేదా ఆందోళనతో బాధపడేవారు ఎక్కువశాతం అతిగా తినే అలవాటు కలిగి ఉంటారు.
పోషకాహార లోపం, గర్భధారణ సమయాలు
తీసుకునే ఆహారంలో శరీరానికి తగినంత పోషకాలు అందకపోయినా, కడుపు నిండినప్పటికీ మెదడుకు ఆ సంతృప్తి అందక మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది. ఇక గర్భధారణ సమయంలో మహిళలకు అదనపు పోషకాహారం అవసరం కాబట్టి ఆకలి ఎక్కువగా వేయడం సహజం. ఒకవేళ మీకు వివరించలేని రీతిలో బరువు తగ్గడం, విపరీతమైన దాహం వేయడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.




