Alzheimers: శరీరంలో ఇది తక్కువైతే మతిమరుపు రావడం ఖాయం.. ఒకసారి చెక్ చేసుకోండి.
Alzheimers: ఇప్పటివరకు చాలా మంది ఐరన్ లోపాన్ని కేవలం బలహీనత, అలసటతో మాత్రమే అనుసంధానం చేసేవారు.
Alzheimers
Alzheimers: ఇప్పటివరకు చాలా మంది ఐరన్ లోపాన్ని కేవలం బలహీనత, అలసటతో మాత్రమే అనుసంధానం చేసేవారు. కానీ తాజా పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే. ఇది మెదడు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపి, భవిష్యత్తులో అల్జీమర్స్ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు.
తాజా పరిశోధన ఏమంటోంది?
2026 ఏప్రిల్ 17న జామా నెట్‌వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ పరిశోధనను కరలోలిన్సికా, స్టాక్‌హ్లామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి చేశారు. ఇందులో భాగంగా 2200 మందికి పైగా వృద్ధులపై దీర్ఘకాలికంగా అధ్యయనం చేశారు. రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో అల్జీమర్స్‌కు సంబంధించిన బయోమార్కర్లు ఎక్కువగా కనిపించాయి. తర్వాత కాలంలో వారిలో డిమెన్షియా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
అనీమియా – మెదడుతో ఉన్న సంబంధం
రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే దానిని ఐరన్ డిఫిషెన్సీ అనిమియా అంటారు. ఇది కేవలం శరీరానికి మాత్రమే కాకుండా మెదడుకు కూడా ప్రభావం చూపుతుంది. హీమోగ్లోబిన్ తగ్గితే ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది
మెదడుకు సరైన ఆక్సిజన్ అందకపోతే పనితీరు మందగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతుంది.
ప్రమాదం ఎవరికి ఎక్కువ?
ఈ స్టడీలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. అనీమియా ఉన్న పురుషుల్లో డిమెన్షియా ప్రమాదం మహిళల కంటే ఎక్కువగా ఉంది. అయితే సాధారణంగా మహిళల్లో అనీమియా ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలోని బయాలజికల్ ప్రతిస్పందనలు వేరుగా ఉండడం అని నిపుణులు చెబుతున్నారు. అలాగే, రక్తంలో p-tau217 అనే ప్రోటీన్ ఎక్కువగా ఉన్నవారిలో ప్రమాదం మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్య
ఈ సమస్య చిన్నది కాదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.2 బిలియన్ మంది ఐరన్ లోప అనీమియాతో బాధపడుతున్నారు. యుకేలోనే దాదాపు 1 కోటి మంది ఈ సమస్యతో ఉన్నారు. అందుకే ఇది ఇప్పుడు ఒక పెద్ద పబ్లిక్ హెల్త్ సమస్యగా మారింది.
ఎలా నివారించాలి? చికిత్స ఉందా?
ఈ సమస్యను ముందుగానే నియంత్రించవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలకూర వంటి ఆకుకూరలు, ధాన్యాలు, మాంసాహారం (రెడ్ మీట్), అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్లు తీసుకోవాలి.
రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. నిపుణుల ప్రకారం, సుమారు 45% డిమెన్షియా కేసులను సరైన జీవనశైలి, ముందస్తు జాగ్రత్తలతో తగ్గించవచ్చు.
గమనిక: ఈ వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. డాక్టర్ల సూచనలకు ఇవి ప్రత్యామ్నాయం కావు. కావున ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.




