Back Pain: చిన్న వయసులోనే నడుము నొప్పా.? ఇవి కూడా కారణాలు కావొచ్చు
Back Pain: ప్రస్తుత రోజుల్లో చాలామంది వెన్ను, నడుము నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు రావడం సహజమే అయినప్పటికీ.. చిన్న వయసులోనే చాలామందికి ఈ నొప్పులు వస్తున్నాయి.
Back Pain: చిన్న వయసులోనే నడుము నొప్పా.? ఇవి కూడా కారణాలు కావొచ్చు
Back Pain: ప్రస్తుత రోజుల్లో చాలామంది వెన్ను, నడుము నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఇలాంటి సమస్యలు రావడం సహజమే అయినప్పటికీ.. చిన్న వయసులోనే చాలామందికి ఈ నొప్పులు వస్తున్నాయి. మన రోజువారీ అలవాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
వెన్ను, నడుము నొప్పులకు కారణాలేంటి?
వెన్ను, నడుము నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో విటమిన్ డి లోపం, ఎముకలు బలహీనపడటం, కండరాలు పట్టేయడం, కీళ్ల సమస్యలు వంటివి నొప్పులకు దారితీయవచ్చు. కొన్నిసార్లు కిడ్నీలకు సంబంధించిన సమస్యల వల్ల కూడా నడుము ప్రాంతంలో నొప్పి రావచ్చు. అయితే ప్రతి నొప్పికి ఇదే కారణమని భావించకూడదు. నొప్పి ఎక్కడ వస్తోంది, ఎంతకాలంగా ఉంది, ఇతర లక్షణాలు ఉన్నాయా అనే అంశాల ఆధారంగా అసలు కారణాన్ని గుర్తించాలి.
గంటల తరబడి కూర్చోవడం, తప్పు భంగిమలు
ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం వల్ల వెన్ను, నడుము కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసేవారు, సరైన భంగిమలో కూర్చోనివారు ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. మొబైల్‌లో రీల్స్ చూస్తున్నప్పుడు తలను ముందుకు వంచడం, వంగి కూర్చోవడం కూడా మెడ, వెన్ను కండరాలపై ప్రభావం చూపుతుంది.
చెడు ఆహారపు అలవాట్లు, అతిగా వ్యాయామం
శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా వెన్ను, నడుము నొప్పుల సమస్యను పెంచవచ్చు. పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఎముకలు, కండరాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మరోవైపు, సరైన శిక్షణ లేకుండా భారీ బరువులు ఎత్తడం, శరీర సామర్థ్యానికి మించి వ్యాయామం చేయడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పులు రావచ్చు. అందుకే వ్యాయామం చేసేటప్పుడు సరైన పద్ధతులను పాటించాలి. బరువులు ఎత్తే సమయంలో శరీరాన్ని ఎలా ఉంచాలి, ఎంత బరువు ఎత్తాలి అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నొప్పి ఉన్నప్పుడు బలవంతంగా వ్యాయామం చేయకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
వెన్ను, నడుము ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ నడవడం, శరీరానికి తగిన శారీరక శ్రమ కల్పించడం అవసరం. కంప్యూటర్ ముందు కూర్చునేటప్పుడు వెన్నుకు సరైన ఆధారం ఉండేలా చూసుకోవాలి. మొబైల్ ఉపయోగించేటప్పుడు తలను ఎక్కువగా వంచకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే మధ్యమధ్యలో లేచి కొద్దిసేపు నడవాలి. అలాగే వ్యాయామం చేసేటప్పుడు సరైన పద్ధతులను పాటించాలి. వెన్ను లేదా నడుము నొప్పులు పదేపదే వస్తున్నా, ఎక్కువ రోజులు కొనసాగుతున్నా నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి తీవ్రంగా ఉన్నా, కాళ్లలో బలహీనత లేదా తిమ్మిరి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తపడవచ్చు.
గమనిక: ఈ వివరాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. వెన్ను, నడుము నొప్పులు కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవాలి.




