నోటి దుర్వాసనకు, కిడ్నీ ఆరోగ్యానికి సంబంధం ఉంటుందా.? నిపుణులు ఏమంటున్నారంటే

Kidney Disease Symptoms: మన శరీరంలో కిడ్నీలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్తకణాల తయారీ.. ఇలా జీవ‌క్రియ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Mokshith
Updated on: 10 Nov 2026 5:50 PM IST
Kidney Disease Symptoms
X

నోటి దుర్వాసనకు, కిడ్నీ ఆరోగ్యానికి సంబంధం ఉంటుందా.? నిపుణులు ఏమంటున్నారంటే

Kidney Disease Symptoms: మన శరీరంలో కిడ్నీలు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో, ఎర్ర రక్తకణాల తయారీ.. ఇలా జీవ‌క్రియ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు, జీవనశైలి అలవాట్లు, జన్యుపరమైన కారణాలతో కిడ్నీల పనితీరు దెబ్బతినవచ్చు. అయితే కొన్ని ముందస్తు ల‌క్ష‌ణాల ఆధారంగా కిడ్నీస‌మ‌స్య‌ల‌ను ముందుగానే గుర్తించ‌వ‌చ్చు.

ఉదయం ముఖం, కాళ్ల వాపు

ఉదయం నిద్రలేచినప్పుడు ముఖం, ముఖ్యంగా కళ్ల చుట్టూ వాపు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. అలాగే పాదాలు, చీలమండల దగ్గర కూడా వాపు రావచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని బయటకు పంపించలేవు. దీంతో శరీరంలో వాపులు ఏర్పడతాయి. కొన్నిసార్లు మూత్రం ద్వారా అవసరానికి మించి ప్రోటీన్ బయటకు వెళ్లడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి వాపులు తరచూ కనిపిస్తుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

మూత్రంలో నురుగు కనిపించడం

మూత్ర విసర్జన చేసినప్పుడు నురుగు లేదా చిన్న చిన్న బుడగలు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా ఈ సమస్య తరచూ ఎదురవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రంలో అధికంగా ప్రోటీన్ బయటకు వెళ్లడాన్ని వైద్య పరిభాషలో 'ప్రోటీన్యూరియా' అంటారు. సాధారణంగా కిడ్నీలు రక్తాన్ని వడపోసేటప్పుడు ప్రోటీన్లను శరీరంలోనే ఉంచుతాయి. కానీ వాటి వడపోత సామర్థ్యం దెబ్బతింటే ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు రావచ్చు. దీనివల్ల మూత్రంలో నురుగు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేగంగా మూత్రం రావడం వల్ల కూడా నురుగు ఏర్పడుతుంది. కాబట్టి తరచూ ఇలా జరుగుతుంటే మూత్ర పరీక్ష చేయించుకోవాలి.

చర్మం పొడిబారడం, తీవ్రమైన దురద

కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు రక్తంలోని వ్యర్థ పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. దీంతో చర్మం పొడిబారడం, తీవ్రమైన దురద వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మాయిశ్చరైజర్లు ఉపయోగించినా దురద తగ్గకపోవడం, తరచూ చర్మంపై దురద అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వైద్య పరిభాషలో ఈ సమస్యను 'యూరెమిక్ ప్రురైటస్' అంటారు. కిడ్నీ వ్యాధి ముదిరినప్పుడు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. అయితే చర్మ సమస్యలకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి.

అలసట, ఏకాగ్రత తగ్గడం

కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం, ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొందరికి ఆలోచనల్లో స్పష్టత తగ్గడం, మతిమరుపు, ఏకాగ్రత లోపించడం కూడా కనిపించవచ్చు. అంతేకాకుండా కిడ్నీలు ఎర్ర రక్తకణాల తయారీకి అవసరమైన హార్మోన్ ఉత్పత్తిలో సహాయపడతాయి. వాటి పనితీరు తగ్గితే రక్తహీనత (అనీమియా) వచ్చే ప్రమాదం ఉంది. దీంతో అలసట మరింత పెరుగుతుంది.

నోటి దుర్వాసన, శ్వాసలో అమ్మోనియా వాసన

నోటి పరిశుభ్రత పాటిస్తున్నప్పటికీ నోటి నుంచి నిరంతరం దుర్వాసన వస్తుంటే దానికి కారణాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా శ్వాసలో అమ్మోనియా లేదా మూత్రం వంటి వాసన రావడం కిడ్నీ సమస్యలకు సంబంధించిన లక్షణం కావచ్చు. కిడ్నీలు వ్యర్థ పదార్థాలను సరిగ్గా బయటకు పంపించలేనప్పుడు అవి రక్తంలో పేరుకుపోతాయి. దీంతో శ్వాసలో ప్రత్యేకమైన వాసన రావచ్చు. ఈ పరిస్థితిని 'యూరెమిక్ బ్రీత్' అంటారు. అయితే నోటి దుర్వాసనకు దంతాలు, చిగుళ్ల సమస్యలు సహా అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.